కీవ్ : సంప్రదాయ క్రిస్మస్ పురస్కరించుకుని రష్యా అధ్యక్షుడు పుతిన్
తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగాయి.
తూర్పు ఉక్రెయిన్‌లోని క్రమాటోర్స్క్ పై రెండు క్షిపణి దాడులు జరిగినట్లు
ఉక్రెయిన్ అధ్యక్ష యంత్రాంగం డిప్యూటీ హెడ్ కిరిలో టిమోషెంకో తెలిపారు.
14కుపైగా ఇళ్లు ధ్వంసమైనట్లు స్థానిక మేయర్ హోంచరెంకో చెప్పారు. ఖేర్సన్లో
జరిగిన దాడిలో ఒకరు మృతి చెందారు. మరోవైపు బఖ్ముత్లోనూ ఇరుపక్షాల మధ్య దాడులు
చోటుచేసుకున్నట్లు ఓ అంతర్జాతీయ వార్తాసంస్థ తెలిపింది. కాల్పుల విరమణ
ప్రారంభానికి కొద్ది ముందు ఈ ఘటనలు జరిగినట్లు వెల్లడించింది.
36 గంటల కాల్పుల విరమణ ప్రకటనకు తూట్లు : సంప్రదాయ క్రైస్తవులు పాటించే
క్రిస్మస్ (ఈ నెల 6, 7 తేదీల్లో) నేపథ్యంలో ఉక్రెయిన్‌లో 36 గంటలపాటు కాల్పుల
విరమణను పాటిస్తామంటూ ఏకపక్షంగా తాను చేసిన వాగ్దానాన్ని రష్యా ఉల్లంఘించింది.
ఆ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే తూర్పు ఉక్రెయిన్ నగరం ఖేర్సన్‌పై క్షిపణి
దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో కొన్ని నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. బాధితులను
కాపాడేందుకు సహాయబృందాలు రంగంలోకి దిగాయి.
మా సైనికులు ముందుకు సాగకూడదనే : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ
ఇదిలా ఉండగా రష్యా ఉద్దేశాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇంతకుముందే
అనుమానాలు వ్యక్తం చేశారు. యుద్ధానికి తాత్కాలిక విరామం ఇవ్వడం ద్వారా
రెట్టించిన ఉత్సాహంతో పోరును కొనసాగించాలన్నది రష్యా పాచిక అని ఆరోపించారు.
డాన్‌బాస్‌లో ముందుకుసాగుతున్న ఉక్రెయిన్ సైనికులను నిలువరించాలన్నది వారి
ఆలోచన అని ఆయన పేర్కొన్నారు.
పుతిన్ ఊపిరి పీల్చుకోవడానికే : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
కాల్పుల విరమణ ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందిస్తూ పుతిన్
ఊపిరి పీల్చుకునేందుకే ఈ విరామం ప్రకటించారని నేను భావిస్తున్నానని అన్నారు.