సియోల్ : క్షిపణి ప్రయోగాలతో తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఉత్తరకొరియా తాజాగా మరో కీలక ఆయుధ వ్యవస్థను పరీక్షించింది. సముద్రగర్భ డ్రోన్ అణుదాడి సామర్థ్యాన్ని తెలుసుకొనేందుకు వీటిని నిర్వహించింది. దక్షిణ కొరియా, అమెరికా, జపాన్ సంయుక్తంగా చేపట్టిన నౌకాదళ విన్యాసాలకు ప్రతిచర్యగా కిమ్ సర్కారు ఈ ప్రయోగం చేపట్టింది. దీంతో కొరియా ద్వీపకల్పంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ దేశ తూర్పు తీర జలాల్లో శుక్రవారం తెల్లవారుజామున ఈ పరీక్షలు చేసినట్లు ఉత్తర కొరియా మిలిటరీ వెల్లడించింది. ‘‘అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అండర్‌వాటర్ డ్రోన్‌ను పరీక్షించాం. ఇది నీటి అడుగున శత్రువుల కదలికలను పసిగట్టి దాడిచేస్తుంది. అమెరికా, దాని మిత్రదేశాల నౌకాదళ విన్యాసాలను అడ్డుకోవడానికి మేము ఇలానే స్పందిస్తాం’’ అని కిమ్ సైన్యం ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా ఉత్తర కొరియా గతంలో కూడా అణ్వాయుధ సామర్థ్యం కలిగిన సముద్రగర్భ డ్రోన్లను పరీక్షించింది. ‘హెయిల్-5-23’ పేరుతో గతేడాది మార్చి నుంచి వీటిని నిర్వహిస్తోంది. ప్రత్యర్థుల నౌకలు, ఓడరేవులే లక్ష్యంగా డిజైన్ చేసిన ఈ డ్రోన్లను తీరం నుంచైనా ప్రయోగించవచ్చని తెలుస్తోంది. ఇవి ఎలా పనిచేస్తాయన్నది కచ్చితంగా తెలియరానప్పటికీ ఉత్తరకొరియా న్యూక్లియర్ బాలిస్టిక్ క్షిపణుల కంటే తక్కువ సామర్థ్యం కలిగినవేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోన్ ఉంగ్ ఆయుధ ప్రయోగాలతో కొరియా ద్వీపకల్పంలో ఇటీవల కొన్నేళ్లుగా ఉద్రిక్తతలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఆయన చేసిన ప్రకటన వీటిని మరింత తీవ్రం చేసింది. ఉభయ కొరియాల మధ్య పునరేకీకరణ అసాధ్యమని చెప్పిన కిమ్ సరిహద్దుల్లో సూదిమొనంత స్థలం ఆక్రమించినా దక్షిణ కొరియా యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.