ఉత్తర కొరియా : ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం తీవ్రమైనట్లు అంతర్జాతీయ సంస్థలు
పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే అక్కడి ఆకలి చావులు కూడా చోటు చేసుకుంటున్నట్లు
తాజా నివేదిక వెల్లడించింది. కొవిడ్-19 మహమ్మారి నుంచి యావత్ ప్రపంచం
బయటపడినా ఉత్తర కొరియా మాత్రం ఇంకా ఆంక్షల వలయంలోనే చిక్కుకుపోయింది.
దేశాలన్నీ అంతర్జాతీయ ప్రయాణాల విషయంలో కఠిన నిబంధనలు సడలించినా కిమ్
సామ్రాజ్యం మాత్రం సరిహద్దులను ఇంకా తెరవలేదు. ఈ క్రమంలోనే అక్కడ తీవ్ర ఆహార
సంక్షోభం నెలకొన్నట్టు అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తంచేస్తున్న విషయం
తెలిసిందే. అక్కడి ప్రజలు సరైన తిండిలేక ప్రాణాలు కోల్పోతున్నట్లు తాజా
నివేదికలు చెబుతున్నాయి. ప్యాంగ్యాంగ్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు
వ్యక్తులు ఇటీవల ఆకలిచావుల బారిన పడినట్లు స్థానిక మహిళ ఒకరు వెల్లడించినట్లు
ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ తెలిపింది. మరో గ్రామంలోనూ ఆకలితో ఇప్పటివరకు
ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ఓ గృహ నిర్మాణ కార్మికుడు వాపోయాడు. ఒకప్పుడు
కొవిడ్‌తో ప్రాణాలు పోతాయేమోనని భయపడ్డామని, కానీ, ఇప్పుడు ఆకలి చావులకు
వణికిపోతున్నామని అక్కడి వారు ఆవేదన వ్యక్తం చేస్తుండటం వారి దయనీయ స్థితికి
అద్దం పడుతోంది.
ఆహార సంక్షోభం నుంచి తప్పించుకునేందుకుగానూ కొందరు పొరుగుదేశం నుంచి అక్రమంగా
ఆహార పదార్థాలను తరలించేందుకు యత్నించారు. కానీ, ఎవరూ అటువంటి చర్యలకు
దిగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. సరిహద్దులు దాటొద్దని పౌరులను
హెచ్చరించిన అధికారులు అటువంటి వారిని కాల్చివేయాలని గార్డులకు ఆదేశాలిచ్చారని
సమాచారం. పేద, మధ్యతరగతి వారే ఎక్కువగా ఆకలి సమస్యను ఎదుర్కొంటున్నారని, ఇది
తీవ్ర ఆందోళనకరమని ఉత్తరకొరియా ఆర్థికవేత్త పీటర్ వార్డ్ పేర్కొన్నారు. ఆహార
సంక్షోభం ఇంకా దిగజారితే పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ విజృంభిస్తోన్న సమయంలో ఉత్తర కొరియా తన సరిహద్దులను
మూసివేసింది. పొరుగు దేశమైన చైనా నుంచి ఎరువులు, ఆహారోత్పత్తికి అవసరమైన
పరికరాలతోపాటు ధాన్యాల దిగుమతి కూడా నిలిపేసింది. దీంతో 2.6 కోట్ల జనాభా ఉన్న
ఉత్తర కొరియాలో పంట దిగుబడి లేక ఆహార సంక్షోభం మొదలయ్యింది. ఇదిలా ఉండగా 1990వ
దశకంలోనూ ఉత్తర కొరియాలో ఆకలి కేకలతో లక్షల మంది చనిపోయారు. ముఖ్యంగా 1994-98
మధ్యకాలంలో దాదాపు 2.5 లక్షల నుంచి 3.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు
అంచనా.