ప్రముఖ వాణిజ్యవేత్త, బయోకాన్ వ్యవస్థాపకులు కిరణ్ మజుందార్ షా భర్త జాన్ షా(73) ఇక లేరు. కొంతకాలంగా పెద్ద పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన అదే అనారోగ్య సమస్యలతో సోమవారం తుదిశ్వాస విడిచారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు కంపెనీ అధికారులు తెలిపారు. “కిరణ్ షా భర్త, బయోకాన్ మాజీ వైస్ చైర్మన్ జాన్ షా ఈరోజు ఉదయం కన్నుమూసినట్లు తెలిసి మేము మీకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము” అని ఒక అధికారి తెలిపారు. కిరణ్ షా తల్లి యామినీ మజుందార్ కూడా ఈ ఏడాది జూన్‌లో క్యాన్సర్‌తో కన్ను మూశారు. కాగా, సోమవారం సాయంత్రం బెంగళూరులోని విల్సన్ గార్డెన్ స్మశాన వాటికలో జాన్ షా అంత్యక్రియలు ముగిశాయి.
బయో ఫార్మసీ రంగంలో ఎనలేని కృషి..
బయోకాన్ అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 120 దేశాల్లో డయాబెటిస్, క్యాన్సర్, ఆటోఇమ్యూన్ డిసీజెస్‌తో బాధపడుతున్న రోగులకు తక్కువ ధరలోనే ఔషదాలు అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా బయోఫార్మా రంగంలో కృషిచేస్తోన్న బయోకాన్ కంపెనీకి జాన్ షా వైస్ చైర్మన్‌గా, నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలు అందించారు.
1978లో బయోకాన్ కంపెనీ ప్రారంభం..1978 లో కిరణ్ మజుందార్ షా బయోకాన్ కంపెనీని స్థాపించగా 1999 నుంచి జాన్ షా బయోకాన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఒకరిగా ఉంటూ వివిధ హోదాల్లో పనిచేస్తూ వస్తున్నారు. బయోకాన్ కంపెనీకి విదేశీ ప్రమోటర్ గా వ్యవహరిస్తూనే బయోకాన్ గ్రూప్ కంపెనీలకు అడ్వైజరీ బోర్డ్ మెంబర్‌గానూ సేవలు అందిస్తున్నారు. గతంలో మధుర కోట్స్ సంస్థకు చైర్మన్ గాను, కోట్స్ వియెల్లా గ్రూప్ కంపెనీకి ఫైనాన్స్, మేనేజింగ్ డైరెక్టర్ గానూ వ్యవహరించారు. కిరణ్ మజుందార్ షా స్థాపించిన బయోకాన్ కంపెనీతో పాటు పలు ఇతర గ్రూప్ కంపెనీల అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించినట్టు వ్యాపారవర్గాలు చెబుతుంటాయి.
మూలం: ఇండియన్ ఎక్స్‌ప్రెస్