పగ్గాల్ని దక్కించుకున్న బండి సంజయ్ కీలకమైన ఎన్నికల సమయంలో ఆ బాధ్యతలకు
దూరమయ్యారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలు ఆయన సారథ్యంలోనే బీజేపీ ఎదుర్కొంటుందని
అందరూ భావించినా అందుకు భిన్నమైన పరిణామం చోటుచేసుకుంది. ఏదైతే దూకుడు ఆయనను
పార్టీలో ముఖ్యనేతగా ఎదిగేలా చేసిందో అదే దూకుడు ఆయనను బలహీనతగా మారిందని
అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించిన బండి సంజయ్ ఎన్నికల
సమయంలో పార్టీ అధ్యక్ష పదవికి దూరమయ్యారు. 2020 మార్చిలో రాష్ట్ర అధ్యక్ష
బాధ్యతలు చేపట్టిన తర్వాత.. దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికలు,
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ నియోజకవర్గం
ఎన్నికల్లో కమలం విజయం సాధించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు
సాధించింది. పలు విడతలుగా ప్రజా సంగ్రామ యాత్రలు చేపట్టిన బండి సంజయ్..
భారతీయ జనతా పార్టీ పట్టణానికి పరిమితమనే వాదన నడుమ గ్రామస్థాయికి చేర్చే
ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బీజేపీ బలోపేతమైందని బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయమని
నేతలు విశ్వసించే స్థితికి పార్టీని చేర్చారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి
బీజేపీ బలోపేతం, ఎన్నికల విజయాలు, జాతీయ నాయకత్వం ఇచ్చిన కార్యక్రమాల్ని
జనంలోకి తీసుకెళ్లడం వంటి సానుకూలతలు ఉన్నా.. కొన్ని అంశాలు సంజయ్‌కు
ప్రతికూలంగా మారాయి. ఆయన వ్యవహారశైలిపై పార్టీ సీనియర్ నేతల్లో అసంతృప్తే
ఇందుకు కారణమని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల పేరుతో అధ్యక్షుడి మార్పు
చేశామని ఢిల్లీ నాయకులు చెబుతున్నప్పటికి పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలే
ఇందుకు కారణమని తెలుస్తోంది. జీహెచ్ఎంసీలో మంచి ఫలితాలు రాబట్టినా ఫ్లోర్
లీడర్‌ను నియమించకపోవడం కరీంనగర్ కార్పొరేషన్లో ఫ్లోర్ లీడర్‌ను
పెట్టకపోవడం వంటివి బీజేపీలో చర్చనీయాంశంగా మారాయి. సీనియర్ నేతల్ని
విస్మరిస్తూ ముందుకెళ్తున్నారని పార్టీలో చర్చ మొదలైంది. సంజయ్ ఒంటెద్దు
పోకడలతో పార్టీకి నష్టం జరుగుతుందని కొందరు నాయకులు వాదన వినిపించారు.
మునుగోడు ఉపఎన్నిక విషయంలో సంజయ్ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈటల
రాజేందర్, రఘునందనరావుతో సమన్వయం లేకపోవడం ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్
ఎత్తివేతపై స్పష్టత లేకపోవడం, శాసనసభలో బీజేపీ శాసనసభాపక్ష నేత ఎన్నిక విషయంలో
ఉదాసీనత సీనియర్ నేతల కినుకకు కారణమయ్యాయి. రాష్ట్ర పార్టీ చేరికల కమిటీ
ఛైర్మన్‌గా ఈటలను నియమించినా ఇతర పార్టీల నాయకుల్ని చేర్చుకునే విషయంలో ఆయనతో
పాటు సంబంధిత జిల్లాల ప్రజా ప్రతినిధులను పట్టించుకోలేదనే విమర్శలు వచ్చాయి.
బండి సంజయ్‌పై తీవ్ర విమర్శలు..రాష్ట్ర సారథ్యం సహా మార్పులు
నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి చేరిక విషయంలో ఉమ్మడి ఆదిలాబాద్
జిల్లా పార్టీ నేతల అభ్యంతరాల్ని పరిగణనలోకి తీసుకోలేదని హైకమాండ్ దృష్టికి
వెళ్లింది. ఇది పార్టీకి నష్టం చేకూరుస్తుందనిఈటల రాజేందర్, కోమటిరెడ్డి
రాజగోపాల్‌రెడ్డి, ధర్మపురి అర్వింద్, రఘునందన్‌రావుతో పాటు పలువురు నేతలు
అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడంతో పాటుగా బహిరంగంగానే విమర్శలు చేశారు.
రఘునందన్‌రావు నేరుగానే బండి సంజయ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. విభేదాలు
పక్కనపెట్టి సమష్ఠిగా పని చేసి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి
చేయాలని ఢిల్లీ పెద్దలు దిశా నిర్దేశం చేసిన ఫలితం లేకుండా పోయింది. కొత్త పాత
నేతల మధ్య అంతరం కొనసాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోరాష్ట్ర సారథ్యం సహా మార్పులు
చేయాలని అగ్రనాయకత్వం నిర్ణయించింది.