న్యూఢిల్లీ : కృత్రిమ వాతావరణంలో కుంకుమ పువ్వు సాగును ప్రోత్సహించే దిశగా
వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇప్పటికే చర్యలు తీసుకుందని ఆ శాఖ మంత్రి నరేంద్ర
సింగ్ తోమర్ తెలిపారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో ఒక యువ వ్యవసాయ
పట్టభద్రురాలు ప్రయోగాత్మకంగా కుంకుమ పువ్వును సాగు మొదలెట్టి తొలి
ప్రయత్నంలోనే స్వచ్ఛమైన 200 గ్రాముల ఫస్ట్ గ్రేడ్ దిగుబడి సాధించిన విషయం మీ
మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చిందా అని రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ
సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. దీనికి మంత్రి జవాబిస్తూ రాష్ట్ర
ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం వ్యవసాయంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన
విద్యార్ధిని ఒకరు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో తన ఇంట్లోనే హ్యుమిడిఫైర్స్
సాయంతో సెమి హైడ్రోపోనిక్స్ పరిస్థితులు సృష్టించి కుంకుమ పువ్వును సాగు
చేస్తున్నట్లు తెలిసిందని చెప్పారు. జమ్మూ, కాశ్మీర్లోని పంపోర్, పుల్వామా, బుడ్గాం, శ్రీనగర్ ప్రాంతాల్లో
కుంకుమ పువ్వు సాగుకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నందున అక్కడ వాణిజ్య
స్థాయిలో ఈ పంట సాగు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. సమశీతోష్ణ వాతావరణం, నీరు
నిల్వని వదులైన భూమి కుంకుమ పువ్వు సాగుకు అనువైన పరిస్థితులు కల్పిస్తాయి.
భూమిలో పీహెచ్ విలువ 6.3 నుంచి 8.3 వరకు ఉండాలి.
ఆహార భద్రత మిషన్లో చిరుధాన్యాలకు ప్రోత్సాహం
న్యూఢిల్లీ : చిరుధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంగా చేసుకుని వాటిని
ప్రజా పంపిణీ వ్యవస్థలో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత మిషన్
కింద సబ్-మిషన్ ఏర్పాటు చేసిందని ఆహార, ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రి సాధ్వి
నిరంజన్ జ్యోతి వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం విజయసాయి రెడ్డి అడిగిన
ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. వ్యవసాయ రైతు
సంక్షేమ శాఖ ఆహార ధాన్యాల ఉత్పత్తి అంచనా ప్రకారం 2022-23లో దేశంలో 159.09
లక్షల మెట్రిక్ టన్నులు చిరుధాన్యాలతో సహా మొత్తం 3235.54 లక్షల మెట్రిక్
టన్నులు వివిధ రకాల ఆహార ధాన్యాలు ఉత్పత్తి జరగనున్నట్లు అంచనా వేశారు. అయితే
2022-23లో అంచనా వేసిన మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో చిరు ధాన్యాల ఉత్పత్తి
కేవలం 4.92% మాత్రమే. టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్
సర్వీసెస్, ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ (మిడ్ డే మీల్) తదితర పథకాల
కింద లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు 2021-22 ఖరీఫ్
మార్కెటింగ్ సీజన్లో 6.07లక్షల మెట్రిక్ టన్నులు చిరుధాన్యాలు కొనుగోలు
చేసినట్లు తెలిపారు. జాతీయ ఆహార భద్రతా యాక్ట్-2013 ప్రకారం ధాన్యం, గోధుమలు,
ముతక ధాన్యం, నాణ్యత కల్గిన ఇతర రకాలను కేంద్ర ప్రభుత్వం ఆహార ధాన్యాలుగా
గుర్తిస్తోందని అన్నారు. చిరుధాన్యాలకు చట్టంలో ప్రత్యేక నియమం ఏదీ లేదని
మంత్రి తెలిపారు.