హైదరాబాద్ : కేవలం ఒకరిద్దరి వల్లే తెలంగాణ రాష్ట్రం రాలేదని, మనసా, వాచా,
కర్మణా సకల జనులు పోరాడితేనే స్వరాష్ట్రం సిద్ధించిందని కేంద్రమంత్రి
కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమం సాగించామని
గుర్తు చేసిన ఆయన.. అలుపెరగని పోరాటం, అకుంఠిత దీక్షతోనే ప్రత్యేక రాష్ట్రం
సాధించామన్నారు. ఎంతోమంది అమరుల త్యాగంతో సాధించుకున్న తెలంగాణలో ఎక్కడ చూసినా
అవినీతి కనబడుతోందని విమర్శించారు. ధనిక రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, ఈ
అప్పుల కోసమేనా తెలంగాణ తెచ్చుకున్నదని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో తెలంగాణ రాష్ట్ర
అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర సాంస్కృతిక శాఖ తరఫున
జరుగుతోన్న వేడుకలను ఆ శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి
ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఆయన
శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఎంతోమంది తమ జీవితాలను పణంగా
పెట్టారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సాధనలో పాల్గొన్న ప్రతి
ఒక్కరికీ నమస్సులు తెలియజేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమం
సాగించామని గుర్తు చేసిన ఆయన అలుపెరగని పోరాటం, అకుంఠిత దీక్షతోనే ప్రత్యేక
రాష్ట్రం సాధించామన్నారు. మనసా, వాచా, కర్మణా సకల జనులు పోరాడితేనే
స్వరాష్ట్రం వచ్చిందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ కోసం అమరులైన వారిని స్మరించుకుందామని పిలుపునిచ్చారు. ఈ
క్రమంలోనే కేవలం ఒకరిద్దరి వల్లే తెలంగాణ రాష్ట్రం రాలేదని, ఆనాడు
ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ మద్దతు వల్లే స్వరాష్ట్రం వచ్చిందని వివరించారు.
చిన్న రాష్ట్రాల వల్లే ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయని తమ పార్టీ ఉద్దేశమన్న
కిషన్‌రెడ్డి అమరవీరుల ఆకాంక్షల మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేయడం లేదని
ఆరోపించారు. కుటుంబ పాలనతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి కనబడుతోందని
విమర్శించారు. నేడు తెలంగాణ ఒక కుటుంబానికి బానిసగా మారే పరిస్థితి వచ్చిందన్న
ఆయన లిక్కర్లో మాఫియా, లీకేజీలో మాఫియా, ప్రాజెక్టుల్లో మాఫియా అంటూ తీవ్ర
స్థాయిలో ధ్వజమెత్తారు.
ఆ హామీలన్నీ ఏమయ్యాయి
ఒకప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల కుప్పగా మారిందని
కిషన్‌రెడ్డి ఆరోపించారు. దొరికిన అన్నిచోట్లా అప్పులు తెస్తున్నారని, అప్పుల
కోసమేనా తెలంగాణ తెచ్చుకున్నదని ప్రశ్నించారు. రూ.వేల కోట్లు అప్పులు తెచ్చినా
జీతాలు కూడా సరిగా ఇవ్వట్లేదని, చేసిన పనులకు నిధులు రాక సర్పంచులు ఆత్మహత్యలు
చేసుకుంటున్నారని మండిపడ్డారు. దళిత ముఖ్యమంత్రి.. దళితులకు 3 ఎకరాల భూమి
హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ప్రశ్నించే వారి చేతులకు సంకెళ్లు వేస్తున్నారని
దుయ్యబట్టారు.
ఆ రిజర్వేషన్లు తొలగించాలి
ఫ్లై ఓవర్ల నిర్మాణంతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావన్న కిషన్‌రెడ్డి ఇళ్ల
కోసం 9 ఏళ్లుగా పేదలు ఎదురు చూస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే ఫామ్‌హౌస్‌లు
పెరుగుతున్నాయే తప్ప పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మాత్రం ఇవ్వడం లేదని
విమర్శించారు. గిరిజనులకు రిజర్వేషన్లు ఎందుకు తీసుకురాలేదో చెప్పాలన్న ఆయన
మతపరమైన రిజర్వేషన్లు ఎందుకు తొలగించడం లేదని సూటిగా ప్రశ్నించారు. మత
రిజర్వేషన్లు తొలగించి గిరిజనులకు ఇవ్వాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.