నర్తు గెలుపుని అడ్డుకోవడానికి కుయుక్తులు
సుధాకర్ విజయానికి కృషి చేయాలి
మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
కవిటి : ఎంఎల్సీ ఎన్నికలను అడ్డుపెట్టుకుని కుల రాజకీయాలతో రెచ్చగొట్టడానికి
విపక్షాలు పావులు కదుపుతున్నాయని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
అన్నారు. శనివారం మధ్యాహ్నం కవిటి మండలం బల్లి పుట్టుగలో జెడ్పీ చైర్పర్సన్
పిరియా విజయ సాయిరాజ్ నివాసం వద్ద జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన ముఖ్య
అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ జిల్లాలో ప్రధానమైన
కాపు, కాళింగ, వెలమ సామాజిక వర్గాలకు రెండు చొప్పున శాసనసభ్యుల పదవులున్నాయని
అన్నారు. జిల్లాలో మరో ప్రధానమైన యాదవ సామాజిక వర్గానికి సముచితమైన పదవిని
ఇవ్వాలనే సీఎం వైఎస్ జగన్ స్థానిక సంస్థల కోటాలో నర్తు రామారావుని శాసనమండలికి
ఎంపిక చేశారని చెప్పారు. అయితే కొంతమంది టీడీపీ నాయకుల అండతో కాపుల
ప్రతినిధులమని కొందరు కుల రాజకీయాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని
అన్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల్లో తమకు ఉన్న ఓట్లు ఎన్ని ఉన్నాయని
ఒకసారి ఆలోచించుకుని ఉంటే ఇలాంటి పనికి ముందుకు వచ్చేవారు కాదన్నారు.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ
చేస్తున్న సీతంరాజు సుధాకర్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో
జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, వైఎస్ఆర్ఎస్పీ ఎంఎల్సీ అభ్యర్థి సీతంరాజు
సుధాకర్, నియోజకవర్గ ఇన్ఛార్జి పిరియా సాయిరాజ్, తూర్పుకాపు కార్పొరేషన్
చైర్మన్ మామిడి శ్రీకాంత్, కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్, డీసీఎంఎస్
చైర్ పర్సన్ పల్ల సుగుణ, ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి,
కడియాల ప్రకాశ్, నిమ్మన దాసు తదితరులు పాల్గొన్నారు.