న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక జీవనాడి పోలవరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో
194 టీఎంసీలు సామర్థ్యం, 45.72 మీటర్ల ఎత్తులో నిర్మాణం చేయాలని పోలవరం
సాధికారిక కమిటీ చైర్మన్ డాక్టర్ జీ.వి.ఎల్ శాస్త్రి, ఆంధ్ర ప్రదేశ్ రైతు
సంఘాల సమన్వయ సమితి కన్వీనర్, మాజీమంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావు, సాగునీటి
వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు
తదితర ప్రతినిదుల బృందం న్యూఢిల్లీలోని జల శక్తి భవన్ లో కేంద్ర జలశక్తి శాఖ
కార్యదర్శి పంకజ్ కుమార్ కు పూర్తి వివరాలతో ఒక వినతిపత్రం సమర్పించింది.
అనంతరం న్యూ ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ లో ఏర్పాటుచేసిన పత్రికా
విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్,
మాజీమంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన
చట్టం 2014 ప్రకారం, పాణ్యన్ కమిటీ నివేదిక ప్రకారం పోలవరం ప్రాజెక్టును
పూర్తిస్థాయిలో 150 అడుగులు ఎఫ్.అర్.ఎల్ లో నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర
ప్రభుత్వంపై ఉందని, రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లు 41.15 మీటర్ల ఎత్తు లో
పోలవరం నిర్మాణం చేపడితే ఇది ఎవ్వరికి ఆమోదయోగ్యం కాదని దీనివలన పోలవరం
నిర్మాణంతో వచ్చే ప్రతిఫలాలు ఎవ్వరికి అందవని చెప్పారు.
*ప్రముఖ ఇరిగేషన్ ఇంజనీర్, మాజీ కేంద్ర మంత్రి, పద్మభూషణ్, కీర్తిశేషులు
డాక్టర్ కె.ఎల్.రావు పేరు మీద విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ పక్కన ఉన్న ఆయన
సమాధి పక్కనే మెమొరియల్, మ్యూజియం ఏర్పాటు చేయాలని దీనివలన రైతులకు, జలవనరుల
శాఖ అధికారులకు ఎంతో ఉపయోగకరమని తెలియజేశారు.
సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల
కృష్ణారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణానది
యాజమాన్య బోర్డు (కే.ఆర్.ఏం.బి)ని విజయవాడలోనే ఏర్పాటు చేయాలని గత తెలుగుదేశం
పార్టీ ప్రభుత్వ హయాంలోనూ, ప్రస్తుత వైసిపి ప్రభుత్వం హయాంలోనూ ప్రభుత్వ
ప్రధాన కార్యదర్శులు కేంద్ర జల శక్తి శాఖకు అనేకసార్లు విజ్ఞప్తి చేశారని
దానికి విరుద్ధంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది బేసిన్ కు అవతల
గోదావరి బేసిన్ దాటి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖపట్నంలో ఈ కార్యాలయాన్ని
ఏర్పాటు చేయాలని నిర్ణయించటం చాలా దారుణమన్నారు.*
కృష్ణానది బేసిన్లో రైలు, రోడ్డు, ఎయిర్ కనెక్టివిటీ ఉన్న విజయవాడలోనే
కె.ఆర్.ఎం.బి కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్
రెండిటికి మధ్యలో ఉండటం వల్ల ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని జల శక్తి శాఖ
కార్యదర్శి పంకజ్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మూడు వినతి పత్రాలపై కేంద్ర
జనశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ పరిశీలించి న్యాయం చేస్తానని రైతు
ప్రతినిధులకు హామీ ఇచ్చారు.