నల్లగా మారిన ఆకాశం..వణికిపోతున్న అధ్యక్షుడు బైడెన్
షికాగో : కెనడాలోని కార్చిచ్చుతోపాటు దక్షిణాది నుంచి వీచే వడగాలులు ఈ వేసవిలో
అమెరికాను తీవ్ర ఇబ్బంది పెట్టే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది.
ఇప్పటికే ఒకసారి కెనడా పొగతో ఉక్కిరిబిక్కిరైన అమెరికన్లకు మరోసారి కళ్ల
నీళ్లు తెప్పించే ముప్పు పొంచి ఉందని పేర్కొంది. దీనికితోడు దక్షిణాది నుంచి
వీచే వడగాలులతోపాటు ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేయనుందని తెలిపింది. గాలిలో తేమ
కారణంగా చొక్కాలు తడిసేంత చెమటలు పట్టనున్నాయని వెల్లడించింది. ఇప్పటికే
వడగాలులు ప్రాణాంతకంగా మారిన సంగతి తెలిసిందే. వాతావరణశాఖ వివరాల ప్రకారం..
కెనడా పొగ మధ్య పశ్చిమ, తూర్పు ప్రాంతాలను ముంచెత్తనుంది. కెనడాలో 235 చోట్ల
అడవుల్లో కార్చిచ్చు వ్యాపించింది. వాటిని నియంత్రించడం సాధ్యం కావడం లేదు.
కెనడాలో చరిత్రలో ఇదే తొలిసారి : కెనడాని కార్చిచ్చు వణికిస్తోంది. చాలా
రోజులుగా కొనసాగుతున్న దావానలంతో తమ దేశ చరిత్రలో ఇప్పటివరకు లేనంతగా వాయు
కాలుష్యం జరిగినట్లు ఆ దేశ వాతావరణ శాఖ తెలిపింది. కెనడా తూర్పూ, పశ్చిమ
భాగాల్లో సంభవించిన కార్చిచ్చుతో రికార్డ్ స్థాయిలో 160 మిలియన్ టన్నుల
కార్బన్ విడుదలైనట్లు పేర్కొంది. దీంతో అటు పక్కనే అమెరికా కూడా చిక్కుల్లో
పడింది. యూఎస్ గగనతలాన్ని పొగలు కమ్మేశాయి. న్యూయార్క్, టొరెంటో నగరాల్లో
ఆకాశం నల్లని దుప్పటి కప్పినట్లు తయారైంది. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం
చేస్తున్నారు. కెనడాలో చాలా రోజులుగా అడవుల్లో మంటలు చెలరేగాయి. బ్రిటీష్
కొలంబియా, అల్బెర్టా, సస్కట్చేవాన్, తూర్పున అంటారియో, క్యూబెక్, నోవా
స్కోటియాతో సహా పలు ప్రాంతాల్లో కార్చిచ్చు వ్యాపించింది. మే నెల నుంచే ఆదేశ
అధికార యంత్రాంగం ఎన్నో రకాలుగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ప్రస్తుతం
490 ప్రదేశాల్లో మంటలు చెలరేగగా 255 ప్రదేశాల్లో నియంత్రించలేని స్థితిలో
దావానలం వ్యాపించింది.
మిన్నెసోటా, మిన్నియాపాలిస్లలో వాతావరణం నల్లగా మారిపోయింది. దీంతో మంగళవారం
రాత్రి నుంచి మిన్నెసోటాలో 23వ గాలి నాణ్యత హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే ఆ
దేశంలో గత జనవరి నుంచి 76,129 కిలోమీటర్లలో అటవీ సంపద కాలి బూడిదైంది. 1989
నాటి విపత్తు కంటే ఇదే అతి పెద్దది. అప్పట్లో 75,596 కిలోమీటర్ల మేర మంటలు
వ్యాపించగా ప్రస్తుత కార్చిచ్చు ఆ రికార్డ్‌ను దాటిపోయింది. కెనడాలో
విస్తరిస్తున్న కార్చిచ్చుతో అమెరికాలో వాతావరణం ఇబ్బందుల్లో పడింది.
న్యూయార్క్ 413 వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ)తో ప్రపంచంలోనే అత్యంత వాయు కాలుష్య
నగరంగా నిలిచింది. స్కేల్‌పై గరిష్ఠ ఏక్యూఐ 500 అయితే.. న్యూయార్క్ నగరంలో
వాయు కాలుష్యం 400 దాటిందంటేనే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. దీంతో యూఎస్
అధ్యక్షుడు జో బైడెన్ అప్రమత్తమయ్యారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి
తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.