అమరావతి : పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణాలకు మంజూరు
చేసే నిధులకు తగ్గట్లు ఆసుపత్రి బోర్డుల్లో జాతీయ ఆరోగ్య మిషన్ లోగోకు స్థానం
కల్పించకపోవడంపై కేంద్రప్రభుత్వం పలు రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది.
కేంద్రమంత్రి భారతీ ప్రవీణ్ పవార్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలో
ఆయుష్మాన్ భారత్ కింద కేంద్రం 60% నిధులను ఇస్తున్నా అందుకు తగ్గట్లు
ప్రధాని మోదీ చిత్రం, జాతీయ ఆరోగ్య మిషన్ చిహ్నాలు లేకపోవడంపై తీవ్రస్థాయిలో
అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితులే పంజాబ్, ఇతర రాష్ట్రాల్లోనూ
ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే నిధుల మంజూరుకు కేంద్ర ఆర్థికశాఖ
అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర
బ్రాండింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారా? వాస్తవాలను తెలియచేయాలని అన్ని
రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం లేఖలు రాసింది. ఈ విషయాన్ని దిల్లీకి వెళ్లిన
రాష్ట్ర అధికారుల వద్ద కూడా కేంద్రప్రభుత్వ అధికారులు ప్రస్తావించినట్లు
తెలిసింది. కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి జాతీయ ఆరోగ్య మిషన్ లోగోలను
ఆసుపత్రుల బోర్డుల్లో వాడుతున్నామని, నిధులు ఆపకుండా చూడాలని రాష్ట్ర
అధికారులు కేంద్రాన్ని కోరినట్లు ఢిల్లీ వర్గాలు తెలిపాయి. ఈ లోగోల వాడకాన్ని
కేంద్రప్రభుత్వ వెబ్సైట్లోనూ అప్లోడ్ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం
తెలిపిందని సమాచారం.