విజయవాడ : కేంద్రం ఎప్పటి మాదిరిగానే 2023-24 బడ్జెట్లోనూ ఆంధ్రప్రదేశ్‌కు
అన్యాయం చేసిందని సిపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు.
రాష్ట్ర ప్రజల హక్కు అయిన ‘ప్రత్యేకహోదా’కు మొండిచెయ్యి చూపింది. విభజన హామీల
ను పూర్తిగా అటకెక్కించింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాధ్యత తన మొసలి కన్నీరు
కార్చిన ప్రధాని గత ఎనిమిది సంవత్సరాలుగా ద్రోహం చేస్తూనే వచ్చారు. రాష్ట్ర
అభివృద్ధిని అదానికి బిజెపి తాకట్టుపెట్టింది. విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు
ఫ్యాక్టరీ వంటి వాటి ఊసెత్తలేదు. ప్రభుత్వ రంగంలో ఉన్న విశాఖ ఉక్కును
బలపర్చుకోడానికి ఎలాంటి ప్రతిపాదన లేదు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లా
వంటి వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయించలేదు.
ప్రతిష్టాత్మక విద్యా సంస్థల సంగతీ అలాగే ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల గిరిజన
విశ్వవిద్యాలయాలకు 2022-23 సం॥ బడ్జెట్‌కన్నా 15 శాతం కోత విధించడం అమానుషం.
మొత్తం 62 పేజీల బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ఆంధ్రప్రదేశ్ అన్నమాటనే
ఉచ్ఛరించకపోవడం దారుణం. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కర్ణాటకు కొత్తగా
ప్రత్యేక కేటాయింపులు చేసిన కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరాన్ని
నిర్లక్ష్యం చేసింది. నిర్వాసితులకు మొండిచేయి చూపింది. రాజధాని అభివృద్ధిని
నిర్లక్ష్యం చేసింది. అమరావతికి తొంటిచేయి చూపింది. ఉపాధిహామీ కేటాయింపుల్లో
సగం కోతపెట్టడం, ఆహారం, ఎరువులపై సబ్సిడీలను ఘోరంగా కుదించడం వల్ల సామాన్యులు
తీవ్ర ఇక్కట్లపాలవుతారు. విద్యుత్ సంస్కరణలు, పట్టణాల్లో యూజర్ ఛార్జీల
వంటివి జనం నడ్డి విరుస్తాయి. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి నామమాత్రపు
కేటాయింపులు చేసింది. దేశంలో 16 శాతం ఉన్న షెడ్యూల్డ్ కులాలకు కేవలం 3.5శాతం
మాత్రమే బడ్జెట్లో కేటాయించారు. అలాగే 8.6శాతంగా ఉన్న షెడ్యూల్ జాతులకు
కేవలం 2.7శాతం మాత్రమే కేటాయించారు. సబ్‌ప్లాన్ గురించి ప్రస్తావనే లేదు. ఆ
తరగతులకు ఈ బడ్జెట్ పూర్తిగా అన్యాయం చేసింది. రాష్ట్రానికి తీవ్ర
నిరాశకలిగించిన కేంద్ర బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం
వ్యతిరేకించాలని కోరుతున్నాం. ద్రోహపూరిత బడ్జెట్‌ను నిరసించవలసిందిగా ప్రజలకు
సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నదని రాష్ట్ర కార్యదర్శి
వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.