ఇటీవలి కాలంలో దక్షిణాది రాష్ట్రాల్లో గవర్నర్లు, ప్రభుత్వాల మధ్య వివాదాలు పెచ్చరిల్లుతున్నాయి. ముఖ్యంగా భాజపాయేతర రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, కేరళలో ఈ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్ర గవర్నర్ కు షాకిచ్చింది. గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను కేరళ కళామండలం డీమ్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్‌గా తొలగిస్తూ కేరళ ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు విశ్వవిద్యాలయ నిబంధనలను మారుస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. కొంత కాలంగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌కు, రాష్ట్రప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతోంది. వైస్ ఛాన్సలర్ల నియామకం సహా యూనివర్సిటీల పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈనేపథ్యంలో విజయన్ సర్కారు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో సాంస్కృతిక కళా రంగానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తిని నియమించేలా విశ్వవిద్యాలయ నిబంధనలను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. గత నెలలో కేరళలోని 11 యూనివర్సిటీల ఉపకులపతులు రాజీనామా చేయాలంటూ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆదేశాలివ్వడాన్ని విజయన్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.