నిర్మాణాన్ని పరిశీలించిన కేసిఆర్
హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ తీరాన ఒక పక్క జ్జానబోధి బుద్ధుడు, మరో పక్క
రాజ్యాంగ నిర్మాత, కర్తవ్యదీక్షాపరుడు డా. బిఆర్ అంబేద్కర్, ఎదురుగా త్యాగాలను
గుర్తుచేసే అమరవీరుల దీపకళిక నిర్మాణాలతో, దేశంలోనే కనీవిని ఎరుగని రీతిలో,
అత్యంత వైభవోపేతంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటేలా నిర్మితమౌతూ
మరికొద్ది రోజుల్లో ప్రారంభోత్సవానికి సిద్ధమౌతున్న తెలంగాణ ప్రజాపాలనా సౌధం
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవనం తుదిమెరుగులు దిద్దుకుంటోంది.
సిఎం కేసీఆర్ దార్శనికతతో, అత్యంత సహజమైన రీతిలో, నలు దిశలనుంచి సహజమైన గాలి
వెలుతురు ప్రసరించేలా, ఆహ్లాదకరమైన వాతావరణంలో సచివాలయ సిబ్బంది విధులు
నిర్వహించేలా దేశంలోనే అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో, గ్రీన్ బిల్డింగ్
కాన్సెప్ట్ తో నిర్మితమౌతున్న రాష్ట్ర సచివాలయం ముఖ్యమంత్రి పుట్టిన రోజు
ఫిబ్రవరి 17 న ప్రారంభోత్సవానికి సిద్ధమౌతోంది.
ఈ సందర్భంగా… తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ
భవన నిర్మాణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు మంగళవారం
మధ్యాహ్నం పరిశీలించారు. తుదిమెరుగులు దిద్దుకుంటున్న సచివాలయ ముఖద్వారం
మొదలుకొని నలు దిక్కులా కలియతిరిగి అణువణువునూ సిఎం కేసీఆర్ పరిశీలించారు.
దాదాపు రెండు గంటలకు పైగా సాగిన సచివాలయ పనుల పురోగతి పరిశీలనలో, మంత్రి
వేముల ప్రశాంత్ రెడ్డి సహా ఇంజనీర్లకు వర్క్ ఏజెన్సీలకు పలు సూచనలు చేశారు. ఆరవ అంతస్తు నుండి అటు హుస్సేన్ సాగర్ తీరం వైపు నిర్మితమౌతున్న కట్టడాలను కిటికీ నుండి బయటికి వంగి క్షుణ్ణంగా
పరిశీలించి చూసారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వెంట రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్
రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూధనా చారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు
సండ్ర వెంకట వీరయ్య, ఆరూరి రమేశ్, దివాకర్ రావు బీఆర్ఎస్ నాయకులు దాసోజు
శ్రవణ్, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల
సుధాకర్ తేజ, షాపూర్ జీ పల్లోంజీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు తదితరులు
పాల్గొన్నారు.