హైదరాబాద్ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తుంటి ఎముక శస్త్రచికిత్స అనంతరం హైదరాబాద్ నంది నగర్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎన్నికలు ముగిసిన అనంతరం కేసీఆర్ బాత్రూంలో జారిపడడంతో ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఈ నేపథ్యంలో, మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆదివారం సతీ సమేతంగా కేసీఆర్ నివాసానికి వచ్చారు. క్రమంగా కోలుకుంటున్న కేసీఆర్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా ఆరోగ్యవంతులు కావాలంటూ ఆకాంక్షించారు. కాగా, కేసీఆర్ నివాసానికి వచ్చిన నరసింహన్ దంపతులకు కేటీఆర్ స్వాగతం పలికారు.