చేవెళ్ల : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ,
ఎస్టీ డిక్లరేషన్లో ప్రకటించిన 12 హామీలు అమలు చేస్తామని ఏఐసీసీ చీఫ్
మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కేవీఆర్
మైదానంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజాగర్జన సభకు ఖర్గే ముఖ్యఅతిథిగా
హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వాన్ని
సాగనంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు. తెలంగాణ కోసం అన్ని వర్గాల ప్రజలు
పోరాటం చేస్తే.. తనవల్లే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ చెబుతున్నారని
విమర్శించారు. సోనియాతో ఫొటో తీసుకుని బయటకు వచ్చి మాట మార్చారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాలను నరేంద్ర మోడీ ఎన్నిసార్లు తిడతారని ప్రశ్నించారు.
దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెసేతర ప్రభుత్వాలు దేశానికి ఏం చేశాయని
నిలదీశారు. నెహ్రూ, పటేల్ కలిసి చిన్న చిన్న రాజ్యాలను ఏకం చేశారని గుర్తు
చేశారు. 53 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో దేశాన్ని బలోపేతం చేశామని గుర్తు
చేశారు. ‘‘ఆహార భద్రత చట్టాన్ని మేమే తెచ్చాం. తెలంగాణలో సాగునీటి
ప్రాజెక్టులను ఎవరు నిర్మించారు? మేం చేసిన పనుల వల్లే ఆహారధాన్యాల ఉత్పత్తి
పెరిగింది. భూ సంస్కరణలు అమలు చేసి జమీందారీ వ్యవస్థను నిషేధించాం. బ్యాంకులను
జాతీయం చేసింది కాంగ్రెస్ పార్టీ. నరేగా చట్టం తెచ్చింది ఎవరు?. హైదరాబాద్కు
అనేక సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది. దేశంలోని ప్రముఖ కంపెనీలను
కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరి చేతిలో సెల్ఫోన్ ఉందంటే
రాజీవ్గాంధీనే కారణం. హరిత విప్లవం, శ్వేత విప్లవం కాంగ్రెస్ హయాంలోనే
వచ్చాయి. మేం చేపట్టిన కార్యక్రమాల వల్లే మహిళా అక్షరాస్యత 65శాతమైంది.
విద్యా, వైద్య రంగాల్లో అనేక సంస్కరణలు చేపట్టాం.దేశాన్ని ఐక్యంగా ఉంచడమే
కాంగ్రెస్ సిద్ధాంతం. ప్రజల మేలు కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. దేశ
ఐక్యతకు కృషి చస్తూ ఇందిర, రాజీవ్ ప్రాణాలు వదిలారు’’ అని మల్లికార్జున ఖర్గే
వివరించారు. ప్రజాస్వామ్య దేశం వల్లే తాను కాంగ్రెస్ అధ్యక్షుడిని
అయ్యానన్నారు. కేసీఆర్ బయట బీజేపీని తిడతారు, లోపల మంతనాలు జరుపుతారని
విమర్శించారు. సభావేదికపై ఏర్పాటు చేసిన గద్దర్ చిత్రపటానికి ఖర్గే పూలమాల
వేసి నివాళులర్పించారు. ఖర్గే సమక్షంలో పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో
చేరారు. కార్యకర్తలు భారీగా రావడంతో చేవెళ్ల-శంకర్పల్లి మార్గంలో కిలోమీటర్ల
మేర వాహనాలు నిలిచిపోయాయి.