ఒమైక్రాన్ ఉప వేరియంట్ బీఎఫ్.7 మన దేశంలోకి అక్టోబరులోనే ప్రవేశించిందని.. కేసులు చాలా స్వల్పంగా వచ్చాయని, డెల్టా తరహాలో ఇది ప్రమాదకరమేమీ కాదని తేలిందని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ వేరియంట్ బారినపడినవారిలో ఎవరికీ అపాయం కలగనందున ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఉన్న ఒమైక్రాన్ వేరియంట్లు ఒకరి నుంచి ఐదుగురికి వ్యాపిస్తే.. బీఎఫ్.7 ఒకరి నుంచి పదిమందికి సోకే వీలుందని తెలిపారు. అయితే, ఊపిరితిత్తుల వరకు వ్యాపించే గుణం లేదని, గొంతు వరకు మాత్రమే పరిమితమవుతుందన్నారు. వృద్ధులు, గుండె జబ్బు, కేన్సర్, మధుమేహం, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దేశంలో 28 శాతం మంది మాత్రమే బూస్టర్ డోసు వేసుకున్నారని, కానీ, ప్రతి ఒక్కరూ తప్పకుండా వేసుకోవాలని సూచించారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బూస్టర్‌గా కొర్బెవాక్స్ వేసుకుంటే కొవిడ్‌కు పూర్తిస్థాయిలో చెక్ పెడుతుందని తమ అధ్యయనంలో తేలినట్లు వివరించారు. ఈ ఫలితాలు ‘హై-ఇంపాక్ట్ ఫ్యాక్టరీ’ జర్నల్ వ్యాక్సిన్‌లో ప్రచురితమైనట్లు తెలిపారు. ‘‘చైనా, జపాన్, దక్షిణ కొరియా, అమెరికా, బ్రెజిల్లో బీఎఫ్.7 కేసులు భారీగా వస్తుండడంతో భారత లోనూ ఆందోళన మొదలైంది. కానీ, అక్కడికి ఇక్కడకు చాలా తేడా ఉంది. చైనాలో జీరో కొవిడ్ విధానం ఎత్తివేయడంతో ఒక్కసారిగా కేసులు పెరిగాయి. మన దేశంలోలా అక్కడి వ్యాక్సిన్‌లో నాణ్యత లేదు. పూర్తిస్థాయిలో పంపిణీ కూడా జరగలేదు. భారతలో రెండు డోసులు పూర్తిస్థాయిలో పంపిణీ అయ్యాయి. ఎన్ని వేరియంట్లు వచ్చినా తట్టుకునే శక్తి వచ్చింది’’ అని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. బీఎఫ్.7 వ్యాప్తి ఎంత వేగమో, తగ్గుదల కూడా అంతే వేగంగా ఉంటుందన్నారు. దేశంలో దీని వ్యాప్తి మొదలైతే ఫిబ్రవరికి గరిష్ఠానికి చేరి, మార్చిలో తగ్గిపోతుందని వివరించారు. బూస్టర్ డోసు, మాస్కులు, రద్దీ ప్రాంతంలో ఎక్కువసేపు ఉండకపోవడం, భౌతిక దూరం పాటించాలని సూచించారు.
దేశంలో ప్రస్తుతం మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, అందులో బూస్టర్ డోసుగా కొర్బెవ్యాక్స్ మెరుగైన ఫలితాలను ఇస్తుందని నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. వేరియంట్లను ఎదుర్కోవడంలో సమర్ధవంతంగా పనిచేసి శరీరంలో రక్షణ వ్యవస్థను మెరుగుపరుస్తుందని చెప్పారు. కొవిషీల్డ్ వేసుకున్న వారికి కొర్బెవ్యాక్స్‌ను బూస్టర్‌గా ఇచ్చి.. రోగ నిరోధక ప్రతిస్పందన ఏవిధంగా ప్రభావితం అవుతున్నదో డాక్టర్ శశికళ ఆధ్వర్యంలో తమ బృందం అధ్యయనం చేసిందన్నారు. కొవిషీల్డ్ 2 డోసులు తీసుకున్న 250 మందికి కొర్బెవ్యాక్స్ ఇచ్చినట్లు చెప్పారు. వీరికి అలర్జీ, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటివేవీ కలగ లేదన్నారు. మొత్తమ్మీద 95 శాతం రక్షణ ఉంటుందని స్పష్టమైందన్నారు. 50 మందిలోనే కొద్దిగా దుష్ఫలితాలు కనిపించినట్లు చెప్పారు. 30 రోజులు, 90 రోజుల తర్వాత పరిశీలించగా యాంటీబాడీస్ బాగా పెరిగినట్లు చెప్పారు. టి సెల్ (మెమరీ సెల్) గణనీయంగా మెరుగుపడ్డాయన్నారు. దీని ఫలితాలు ఏడాది వరకు ఉంటాయని, ఏదైనా వేరియంట్ సోకితే అప్రమత్తమై ఎదుర్కొంటుందన్నారు. మిక్స్డ్ వ్యాక్సిన్లు సురక్షితమైనవని, ఇంకా బూస్టర్ డోసు పొందనివారు కొర్బెవ్యాక్స్ తీసుకోవడం మంచిదని సూచించారు. కొవిడ్‌కు చెక్ పెట్టడానికి మూడేళ్ల పాటు వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి సూచించారు ఫ్లూ, ఇతర వ్యాక్సిన్ల మాదిరిగా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం మేలు చేస్తుందన్నారు.