నిర్మాతకు, వీక్షకుడికి లాభం చేకూరేలా జీవో నెం.13
ఏపీ ఫైబర్ నెట్ ద్వారా రూ.39 కే “లవ్ యూ టూ” సినిమా
త్వరలో మూరుమూల ప్రాంతాలకు సైతం ఏపీఎస్ఎఫ్ఎల్ సేవలు
ఏపీఎస్ఎఫ్ఎల్ ఏ ఓటీటీ ప్లాట్‌ఫాం, థియేటర్లకు పోటీ కాదు
రాబోయే రోజుల్లో థియేటర్లలో ప్రదర్శించే ప్రతి చిత్రాన్ని ఏపీఫైబర్‌నెట్
ద్వారా వీక్షించే అవకాశం
ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్ పి.గౌతంరెడ్డి
కొత్త ప్రతిభను, చిన్న నిర్మాతలు, చిన్న సినిమాలను ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రోత్సహించడం
అదృష్టంగా భావిస్తున్నాం
ఫస్ట్ డే ఫస్ట్ షో విధానం నూతన ఆవిష్కరణ
ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రోత్సాహంతో ప్రతి నెలా 2-3 చిన్న చిత్రాలను ఈ వేదికగా రిలీజ్
చేస్తాం
లవ్ యూ టూ చిత్ర బృందం
విజయవాడ : వినూత్నమైన విధానంతో ప్రజానీకానికి అతి చేరువగా, నేరుగా థియేటర్లో
మాదిరిగా కొత్త సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోని కుటుంబమంతా కలిసి ఇంట్లోనే
కూర్చొని వీక్షించే అవకాశం “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్”
కల్పిస్తోందని ఏపీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ పూనూరు గౌతంరెడ్డి తెలిపారు. విజయవాడలోని
ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ 3వ అంతస్తులోని ఫైబర్ నెట్ కార్యాలయంలో లవ్
యూ టూ చిత్ర బృందంతో కలిసి నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ
సినిమా తీసే నిర్మాతకు, చూసే ప్రేక్షకుడికి లాభం కలిగేలా అతి తక్కువ ధరకే
తొలిరోజే సినిమాను రాష్ట్ర ప్రజలు ఇంట్లో వీక్షించే అవకాశం
కల్పిస్తున్నామన్నారు. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా తొలి సినిమాగా రూ.99కి ఇప్పటికే
“నిరీక్షణ” అనే చిత్రాన్ని విడుదల చేశామని, రెండవ సినిమాగా “లవ్ యూ టూ”
చిత్రాన్ని కేవలం రూ.39లకే 16 జూన్, 2023న (రేపు) ఏపీఎస్ఎఫ్ఎల్ వేదికగా
ద్వారా స్ట్రీమింగ్ చేస్తున్నామన్నారు. ఏపీఎస్ఎఫ్ఎల్ సబ్ స్ర్కైబర్లు ఈ
అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. సబ్ స్ర్కైబ్ చేసుకున్నప్పటి నుండి 24
గంటల వరకు సినిమాను చూసే అవకాశం ఉంటుందన్నారు.
ఏపీఎస్ఎఫ్ఎల్ ను ఒక ధియేటర్గానే భావించాలని గౌతమ్ రెడ్డి సూచించారు. తాము
ఓటీటీ ప్లాట్‌ఫాంలకు కానీ, థియేటర్ల యాజమాన్యానికి గానీ, మరెవరికీ పోటీ కాదని
స్పష్టం చేశారు. చిన్న చిత్రాల నిర్మాతలను ప్రోత్సహించి, వీక్షకుడికి అతి
తక్కువ ధరకే నేరుగా సినిమాను చేరువ చేయడం తమ ఉద్దేశమన్నారు. ఇందులో ఎలాంటి
లాభాపేక్ష లేదని మారుమూల ప్రాంతాలకు సైతం ఫస్ట్ డే ఫస్ట్ షో విధానాన్ని చేరువ
చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఏపీఎస్ఎఫ్ఎల్ అమలు చేస్తున్న విధానంపై నిర్మాతల
మండలి, పలువురి నుండి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయని చెప్పారు. కొందరు
చేస్తున్న విమర్శలను సద్విమర్శలుగా భావిస్తున్నామన్నారు.
ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.13 ప్రకారం రూ.100 కోట్ల బడ్జెట్
మూవీకి మొదటి వారంపాటు టిక్కెట్ ధరను పెంచుకునే వెసులుబాటు కల్పించామన్నారు.
అదేవిధంగా రూ.20 కోట్లలోపు నిర్మించిన సినిమాలను చిన్న చిత్రాలుగా భావిస్తూ
వాటిని కూడా పండుగరోజుల్లో, మరే సందర్భంలోనైనా విడుదల చేసే అవకాశం
కల్పించామన్నారు. ప్రతి థియేటర్లో పెద్ద చిత్రంతో పాటు ఒక షో చిన్న
చిత్రానికి కేటాయించే అవకాశం కల్పించామన్నారు.
రాబోయే రోజుల్లో థియేటర్లలో ప్రదర్శించే ప్రతి చిత్రాన్ని ఏపీ ఫైబర్‌నెట్
ద్వారా వీక్షించే అవకాశం కల్పిస్తామన్నారు. భవిష్యత్తులో పెద్ద సినిమాలను కూడా
ఫైబర్ నెట్ ద్వారా విడుదల చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఈ
సందర్భంగా లవ్ యూ టూ చిత్రయూనిట్‌కు ధన్యవాదాలు తెలుపుతూ చిన్న చిత్రాలకు
ఎప్పుడూ ఏపీఎస్ఎఫ్ఎల్ అండదండలు ఉంటాయని భరోసా ఇచ్చారు. ఏపీఎస్ఎఫ్ఎల్ త్వరలోనే
ఒక యాప్‌ను రూపొందిస్తుందని, ఇకపై యాప్ ద్వారా పాత, కొత్త సినిమాలను కూడా
వీక్షించే అవకాశం లభిస్తుందన్నారు.
ఏపీఎస్ఎఫ్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో
మొట్టమొదటిసారిగా కొత్త టెక్నాలజీని వినియోగించి ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా కుటుంబ
సమేతంగా విడుదలైన రోజే సినిమాను చూసే అవకాశం కల్పించడం గొప్ప విషయమన్నారు.
భవిష్యత్తులో ఈ విధానాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రణాళికలు
రూపొందిస్తున్నామన్నారు. ప్రస్తుత కాలంలో కుటుంబసమేతంగా థియేటర్‌కి వెళ్లి
సినిమాలను చూసే అవకాశం తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో ఏపీఎస్ఎఫ్ఎల్ తెచ్చిన ఫస్ట్
డే ఫస్ట్ షో విధానం సినిమా అభిమానులకు, అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
లవ్ యూ టూ సినిమా హీరో, సినిమా కొరియోగ్రాఫర్ ఆట సందీప్ మాట్లాడుతూ
ఏపీఎస్ఎఫ్ఎల్ తెచ్చిన ఫస్ట్ డే ఫస్ట్ షో విధానం చాలా బాగుందన్నారు. జనాల్లోకి
సినిమా నేరుగా వెళ్లడం ద్వారా తమలాంటి చిన్న సినిమాలకు, హీరోలకు మరింత
ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు. లవ్ యూ టూ సినిమా యువతను, ముఖ్యంగా పెళ్లైన
జంటలను ఆకట్టుకునేలా ఉంటుందన్నారు. తమ సినిమా ఏపీ ఫైబర్ నెట్ ద్వారా
విడుదలవ్వడం సంతోషకరమన్నారు.