చెన్నై : హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి
ప్రస్తుతం అనుసరిస్తున్న కొలీజియం వ్యవస్థను మార్చాల్సిన అవసరం లేదని
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ అభిప్రాయపడ్డారు.
గురువారం చెన్నైలో జరిగిన ఓ కాంక్లేవ్‌లో పాల్గొన్న ఆయన న్యాయవ్యవస్థపై కీలక
వ్యాఖ్యలు చేశారు. న్యాయవిద్య కేవలం విశ్వవిద్యాలయాలు, కళాశాలలకే పరిమితం
కావద్దని సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. మెడికల్
విద్యార్థులకు ఉన్నట్టుగానే న్యాయ విద్యార్థులు కూడా గ్రామీణ ప్రజల కోసం పని
చేసేలా, వారి సమస్యలు అర్థం చేసుకునేలా తప్పనిసరి ఇంటర్న్‌షిప్ ఉండాలని
సూచించారు. దేశంలో సుమారు 66 శాతం మంది పేదరికంలో ఉన్నారని, కేవలం 15 శాతం
మంది మాత్రమే న్యాయ సహాయ సేవలను పొందుతున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో
పేదలు కేసుల్లో పోరాడేందుకు అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారని ఆవేదన
వ్యక్తం చేశారు.