బెంగుళూరు : కర్ణాటక నూతన మంత్రివర్గం కొలువుదీరింది. కొత్తగా ఎన్నికైన 24
మంది శాసనసభ్యులతో గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ శనివారం రాజ్‌భవన్‌లో మంత్రులుగా
ప్రమాణ స్వీకారం చేయించారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వంలో
పూర్తిస్థాయి మంత్రివర్గం శనివారం కొలువుదీరింది. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో
గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ కొత్తగా ఎన్నికైన 24 మంది శాసనసభ్యులతో మంత్రులుగా
ప్రమాణం చేయించారు. కాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ
సీఎంగా డీకే శివకుమార్ సహా 8 మంది మంత్రులుగా మే 20న ప్రమాణస్వీకారం చేశారు.
ఇక తాజా మంత్రివర్గ విస్తరణతో సీఎం, డిప్యూటీ సీఎంలతో కలుపుకొని కేబినట్లో
మొత్తం మంత్రుల సంఖ్య 34కు చేరింది.
కొత్త మంత్రులు వీరే
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు హెచ్‌కే పాటిల్, కృష్ణ బైరేగౌడ,
ఎన్.చెలువరాయస్వామి, కే.వెంకటేశ్, హెచ్‌సీ మహదేవప్ప, కాంగ్రెస్ వర్కింగ్
ప్రెసిడెంట్ ఈశ్వర్ ఖండ్రే, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు దినేశ్
గుండురావు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరితో పాటు క్యాతసాండ్ర ఎన్.రాజన్న,
శరణబసప్ప దర్శనాపుర్, శివానంద్ పాటిల్, రామప్ప బాలప్ప తిమ్మాపుర్,
ఎస్.ఎస్.మల్లికార్జున్, శివరాజ్ సంగప్ప తంగడగి, శరణప్రకాష్ రుద్రప్ప పాటిల్,
లక్ష్మీ హెబ్బాల్కర్, రహీం ఖాన్, డీ.సుధాకర్, సురేశ్ లడ్జులు, సంతోష్,
బీ.ఎస్.మధు బంగారప్ప, ఎమ్.సీ. సుధాకర్, బీ.నాగేంద్ర, లక్ష్మీ హెబ్బాల్కర్,
మంకుల్ వైద్య, ఎమ్.సీ.సుధాకర్ మంత్రులుగా ప్రమాణం చేశారు. కాగా, వీరంతా
శివకుమార్‌కు అత్యంత సన్నిహితులేనని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
అందరికీ సమన్యాయం
ఈ జాబితాలో ఆరుగురు లింగాయత్‌లు, నలుగురు ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన
వారు ఉన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు ఎస్సీ, ఇద్దరు ఎస్టీ, ఐదుగురు ఇతర
వెనుకబడిన కులాలుగా ఉన్న కురుబ, రాజు, మరాఠా, ఈడిగ, మొగవీర సామాజిక వర్గాలకు
చెందిన వారు ఉన్నారు. దినేశ్ గుండురావుకు క్యాబినెట్లో చోటు దక్కడం వల్ల
సిద్ధరామయ్య మంత్రివర్గంలో బ్రాహ్మణులకూ కూడా ప్రాతినిధ్యం లభించినట్లయింది.
పాత మైసూరు, కళ్యాణ కర్ణాటక ప్రాంతాల నుంచి ఏడుగురు చొప్పున, కిత్తూరు కర్ణాటక
ప్రాంతం నుంచి ఆరుగురు, మధ్య కర్ణాటక నుంచి ఇద్దరు మంత్రులుగా ఎంపికయ్యారు.
సీనియర్, జూనియర్ ఎమ్మెల్యేలకు సముచిత గౌరవం ఇవ్వడమే కాకుండా కుల, ప్రాంతాల
వారీగా అందరికి తగిన ప్రాతినిధ్యం కల్పించడంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
సమన్యాయం చేశారని తెలుపుతూ శుక్రవారం రాత్రి కాంగ్రెస్ అధికారిక ప్రకటన విడుదల
చేసింది.
ఇంకా కేటాయించని శాఖలు
ఎన్నికల ఫలితాలు వెలువడ్డ సరిగ్గా వారం తర్వాత (మే 20న)ముఖ్యమంత్రి ప్రమాణ
స్వీకార కార్యక్రమం జరగ్గా మరో వారం రోజుల తర్వాత అంటే శనివారం పూర్తి స్థాయి
మంత్రివర్గ విస్తరణ జరిగింది. అయితే సదరు మంత్రులకు ఏఏ శాఖలు కేటాయించాలనే
దానిపై ఇంకా స్పష్టత రానప్పటికీ శనివారం సాయంత్రానికి ప్రమాణం చేసిన మంత్రులకు
శాఖలను కేటాయిస్తామని ఆ రాష్ట్ర మంత్రి కేహెచ్ మునియప్ప తెలిపారు.
సామాన్యులకూ ఎంట్రీ
మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్‌కు చెందిన కీలక నేతలంతా
విచ్చేశారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, ఝార్ఖండ్
సీఎం హేమంత్ సోరెన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మరోవైపు ఈ ప్రమాణ
స్వీకార వేడుకను తిలకించేందుకు సాధారణ ప్రజలను సైతం రాజ్‌భవన్‌లోకి అనుమతించారు.
ఈ నేపథ్యంలో రాజ్‌భవన్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను
అధికారులు చేశారు.
135 స్థానాల్లో విజయఢంకా
224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకకు ఈనెల 10న ఎన్నికలు జరిగాయి. మే 13న
వెలువడ్డ ఫలితాల్లో కాంగ్రెస్ 135 స్థానాల్లో విజయఢంకా మొగించింది. కాగా,
ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 113ను సునాయాసంగా దాటేసి మే 20న
సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.