కొవ్వూరు : ఫ్రెండ్స్ క్రికెట్ అకాడమీ బెస్ట్ కోచింగ్ ఇవ్వడమే కాకుండా క్రికెట్‌పై పూర్తి అవగాహన పెంచి జాతీయస్థాయిలో పోటీపడే మంచి ఆటగాళ్లను తయారు చేయాలని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ఆకాంక్షించారు. ఆదివారం కొవ్వూరు టౌన్ లోని అభ్యాస స్కూల్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రెండ్స్ క్రికెట్ (నెట్స్) అకాడమీ ప్రారంభోత్సవానికి హోంమంత్రి ముఖ్యఅతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి బ్యాట్ పట్టుకుని కాసేపు క్రీడాకారులను ఉత్తేజపరిచారు. అనంతరం క్రీడాకారులను, విద్యార్థులతో ముచ్చటించారు. అండర్-19 లో దొమ్మేరుకు చెందిన ఇమ్రాన్ ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ స్థాయి ఎంపికవ్వడం పట్ల కోచ్, అకాడమీ ఫౌండర్ డేగల సత్యమూర్తిని హోంమంత్రి అభినందించారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలికితీసి వారికి బంగారు భవిష్యత్ అందించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా కొవ్వూరులో క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయడం, వారిని రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు వచ్చేలా కృషి చేయడం అభినందనీయమన్నారు. జిల్లాస్థాయిలో అండర్-14, అండర్-17, అండర్-19 విభాగాల్లో ఇద్దరు చొప్పున మొత్తం ఆరుగురు అబ్బాయిలు, అండర్ -17 విభాగంలో ఇద్దరు అమ్మాయిలు కొచ్ సత్యమూర్తి తర్ఫీదులో ఎంపికకావడం కొవ్వూరుకి గర్వకారణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నిర్వహించిన సీఎం కప్ లో కొవ్వూరుకు మూడో స్థానంలో నిలబెట్టడం అభినందనీయమన్నారు. ఈ అకాడమీ ద్వారా మరింతమంది మంచి శిక్షణ పొంది వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని హోంమంత్రి తానేటి వనిత అభిలాషించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.