అమరావతి :74వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం నేలపాడు లోని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ముఖ్య అతిధిగా
పాల్గొని పోలీసు బ్యాండు తో కూడిన పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన పిదప జాతీయ
జెండాను ఎగురవేశారు. హైకోర్టు సిబ్బంది జాతీయ గీతాలాపన తర్వాత జరిగిన
కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ డిజిటలైజేషన్ ఆఫ్ రికార్డ్సు
అనేది చాలా ముఖ్యమైన అంశమని అందుకే కోర్టు రికార్డుల డిజిటలైజేషన్ కు చర్యలు
తీసుకుంటున్నట్టు చెప్పారు.రాజ్యాంగ స్పూర్తిని ప్రజాస్వామ్య విలువలను
హక్కులను కాపాడుటలో న్యాయ వ్యవస్థ ఎంతో కీలకపాత్ర పోషిస్తోందని ఆయన ఈసందర్భంగా
గుర్తు చేశారు.జుడీషియల్ ప్రొసెస్ ను మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు
ఆర్టిఫీషియల్ ఇంటిల్జెన్సు దోహదం చేస్తుందని ఆదిశగా తగిన చర్యలు
తీసుకోనున్నట్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా స్పష్టం చేశారు. భారత
రాజ్యాంగం విలువలను కాపాడుటలో ప్రతి ఒక్కరూ చిత్తశుద్ది అంకిత భావాలతో
పనిచేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పిలుపు
నిచ్చారు. ఇందుకు గాను ప్రతి ఒక్కరూ వారు నిర్వహించే విధులను సక్రమంగా
నిబద్ధతతో నిర్వహించాలని సూచించారు. అదే విధంగా దేశ సమగ్రత సమైక్యతలను
కాపాడేందుకు ప్రతి పౌరుడు తనవంతు కృషి చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్
ప్రశాంత్ కుమార్ మిశ్రా సూచించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరో మూడు మాసాల్లో
మరో 14 కోర్టు హాళ్ళతో అత్యాధునిక వసతులతో కూడిన భవనం అందుబాటులోకి రానుందని
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తెలిపారు. ఈనూతన
భవనంలో సుమారు లక్షకు పైగా న్యాయ సంబంధిత పుస్తకాలు వంటివి భద్రపర్చుకుని
న్యాయవాదులకు, అధికారులకు ఉపయోగపడేలా మంచి గ్రంధాలయం కూడా అందుబాటులోకి
రానుందని చెప్పారు. ఈకార్యక్రమంలో రాష్ట అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్
మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగం విశిష్టత రాజ్యాంగ
విలువలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. బార్ కౌన్సిల్ అధ్యక్షులు
ఘంటా రామారావు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పరిరక్షించుటలో న్యాయవ్యవస్థ ఎంతో
కీలకపాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. హైకోర్టు అడ్వకేట్ల సంఘం అధ్యక్షులు
జానకి రామిరెడ్డి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశమంతా ఒకసారి
ఆనాటి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకునే అవకాశం వచ్చిందని
తెలిపారు. అదే విధంగా మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను ఒకసారి
గుర్తు చేసుకునే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. హైకోర్టు బార్ లో వివిధ
ఖాళీలను భర్తీ చేయాల్సిన ఆవశ్యకతను ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ఈ
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు వారి కుటుంబ
సభ్యులు,డిప్యూటీ సొలిసిటర్ జనరల్,పలువురు రిజిష్ట్రార్లు,సీనియర్
న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్
సభ్యులు తదితరులు పాల్గొన్నారు.