రోగనిరోధక వ్యవస్థను కణుతులు ఏమారుస్తున్న తీరుపై మెరుగైన అవగాహన
క్యాన్సర్ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. దీని కట్టడికి విస్తృత పరిశోధనలూ
జరుగుతున్నాయి. ఈ వ్యాధితో చోటుచేసుకునే మరణాలను తగ్గించే శక్తిమంతమైన అస్త్రం
టీకానేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్యాన్సర్ చికిత్సలో తదుపరి అతిపెద్ద
ముందడుగు సమర్థ టీకాల రూపకల్పనేనని వారు పేర్కొన్నారు. వ్యాధిని నయం చేయడానికి
వాడే ఈ వ్యాక్సిన్ల కోసం దశాబ్దాల పాటు పరిశోధనలు జరిగాయి. వాటితో దక్కిన
ఫలితం పరిమితమే. ఇప్పుడు ఆ పరిశోధనలు కీలక మలుపు తీసుకుంటున్నాయని
శాస్త్రవేత్తలు ఘంటాపథంగా చెబుతున్నారు. ఐదేళ్లలో ఈ తరహా వ్యాక్సిన్లు
అందుబాటులోకి వస్తాయని పేర్కొంటున్నారు.
ఏమిటీ టీకాలు : ప్రస్తుతం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నవి వ్యాధులు
దరిచేరకుండా చూసే సంప్రదాయ టీకాలు కావు. కణితులను కుంచింపజేసి, క్యాన్సర్
పునరావృతం కాకుండా చేసే ఇంజెక్షన్లు. వీటితో రొమ్ము, ఊపిరితిత్తుల
క్యాన్సర్లకు చికిత్స చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ప్రమాదకరమైన మెలనోమా
అనే చర్మ క్యాన్సర్, క్లోమ క్యాన్సర్లకు రూపొందిస్తున్న టీకాల విషయంలో
పురోగతి ఉందని వివరించారు.
ఎలా? : రోగనిరోధక వ్యవస్థ దృష్టిని క్యాన్సర్ తప్పించుకుంటున్న తీరును
ప్రస్తుతం శాస్త్రవేత్తలు చాలా మెరుగ్గా అర్థం చేసుకున్నారు. ఇతర
ఇమ్యునోథెరపీల తరహాలో క్యాన్సర్ చికిత్సలు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం
చేస్తాయి. తద్వారా క్యాన్సర్ కణాలను వెతికి, చంపేసేలా చూస్తాయి. క్యాన్సర్
చికిత్సకు ఉద్దేశించిన టీకాల విషయంలో ముందడుగు చాలా సవాళ్లతో కూడుకున్న
వ్యవహారమని పరిశోధకులు తెలిపారు. ప్రొస్టేట్ క్యాన్సర్‌ను నయం చేయడానికి
తొలుత ప్రొవెంజ్ అనే టీకా 2010లో అమెరికాలో ఆమోదం పొందింది. దీన్ని ఇవ్వడం
కోసం రోగి సొంత రోగనిరోధక కణాలను ల్యాబ్‌లో ప్రాసెస్ చేసి, తిరిగి రక్తనాళాల
ద్వారా శరీరంలోకి ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. తొలిదశలో ఉన్న మూత్రాశయ
క్యాన్సర్‌కు, ముదిరిపోయిన దశలో ఉన్న మెలనోమాకూ చికిత్స టీకాలు ఉన్నాయి.
చికిత్సకు ఉద్దేశించిన టీకాలపై పురోగతి చాలా సవాళ్లతో కూడుకున్న వ్యవహారమని
పరిశోధకులు తెలిపారు. తొలుత ప్రొస్టేట్ క్యాన్సర్ చికిత్సకు ప్రొవెంజ్ అనే
టీకా 2010లో అమెరికాలో ఆమోదం పొందింది. ఇందుకోసం రోగిలోని రోగనిరోధక కణాలను
ల్యాబ్‌లో ప్రాసెస్ చేసి, తిరిగి రక్తనాళాల ద్వారా శరీరంలోకి
ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. తొలిదశలో ఉన్న మూత్రాశయ క్యాన్సర్‌కు, ముదిరిపోయిన
దశలో ఉన్న మెలనోమాకూ చికిత్స టీకాలు ఉన్నాయి. కొన్ని కొత్త టీకాలు ఎంఆర్ఎన్ఏ
పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయి. నిజానికి ఈ సాంకేతికతను క్యాన్సర్ కోసమే
అభివృద్ధి చేశారు. అయితే మొదట కొవిడ్-19 టీకాకు దీన్ని ఉపయోగించారు. టీకా
పనిచేయడానికి మొదట అది.. క్యాన్సర్‌ను ప్రమాదకరమైనదిగా గుర్తించేలా రోగనిరోధక
వ్యవస్థలోని టి కణాలకు తర్ఫీదు ఇవ్వాలని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలోని
క్యాన్సర్ టీకా సంస్థ శాస్త్రవేత్త నోరా డిసిస్ చెప్పారు. ఆ శిక్షణ పొందాక..
టి కణాలు సంబంధిత ముప్పును వేటాడటానికి శరీరంలో ఎక్కడికైనా పయనించగలవని
తెలిపారు. ఈ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రూపొందించిన టీకాలను తొలిదశ,
ముదిరిపోయిన స్థితిలో ఉన్న రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులపై
పరీక్షిస్తున్నారు. వచ్చే ఏడాది దీని ఫలితాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
నివారణకు : క్యాన్సర్ నివారణకూ ఇప్పటికే టీకాలు అందుబాటులోకి వచ్చాయి.
దశాబ్దాల నాటి హెపటైటిస్ బి వ్యాక్సిన్లు కాలేయ క్యాన్సర్‌ను
నివారిస్తున్నాయి. 2006లో ప్రవేశపెట్టిన హెచ్‌పీవీ టీకాలు గర్భాశయ ముఖద్వార
క్యాన్సర్‌ను నిరోధిస్తున్నాయి. ఇలాంటి టీకాలు మరిన్ని రానున్నాయని
శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికాని ఫిలడెఫ్పియాలో సుసాన్ దోమ్చెక్ అనే
పరిశోధకురాలు బీఆర్సీఏ ఉత్పరివర్తనాలున్న 28 మంది ఆరోగ్యవంతులను ఎంపిక
చేసుకున్నారు. ఈ ఉత్పరివర్తన రొమ్ము, అండాశయ క్యాన్సర్ ముప్పును పెంచుతుంది.
ఈ పరిశోధనలో తొలిదశలో ఉండే అసాధారణ కణాలను చంపేయాలన్నది లక్ష్యం. సమస్యలు
కలిగించకముందే వాటిని నిర్మూలిస్తామని సుసాన్ పేర్కొన్నారు. ఒక తోటలో
ఎప్పటికప్పుడు కలుపు మొక్కలను తొలగించడం లాంటిదని ఆమె వివరించారు.
ప్రీక్యాన్సరస్ లంగ్ నాడ్యూల్స్, క్యాన్సర్ ముప్పును పెంచే ఇతర అంశాలు
కొందరికి వంశపారంపర్యంగా వస్తుంటాయి. ఇలాంటివారు ఆ వ్యాధి బారినపడకుండా
నివారించే టీకాలను పలువురు శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు.
వంశపారంపర్యంగా లించ్ సిండ్రోమ్ అనే రుగ్మత ఉన్నవారికి జీవితకాలంలో
క్యాన్సర్ వచ్చే ముప్పు 60-80% వరకూ ఉంటుంది. క్యాన్సర్ టీకాల ప్రయోగాలకు
వీరు బాగా ఉపయోగపడతారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
వ్యక్తిగత టీకాలు : ఔషధ సంస్థలు మోడెర్నా, మెర్క్ సంయుక్తంగా మెలనోమా
బాధితులకు పర్సనలైజ్డ్ ఎంఆర్ఎన్ఏ టీకాలను అభివృద్ధి చేస్తున్నారు. దీనిపై
త్వరలోనే భారీ అధ్యయనాన్ని నిర్వహించనున్నారు. రోగి తీరుతెన్నులకు అనుగుణంగా
వారికోసమే ప్రత్యేకంగా ఈ టీకాను రూపొందిస్తారు. ఇలాంటి వ్యక్తిగత టీకాలు
రోగనిరోధక వ్యవస్థకు తర్ఫీదు ఇచ్చి, క్యాన్సర్ ఉత్పరివర్తన ఆనవాళ్లను వేటాడి,
ఆ కణాలను చంపేస్తాయి. అయితే ఇలాంటి వ్యాక్సిన్ల ధర చాలా ఎక్కువగా ఉంటుందని
చెబుతున్నారు.