విజయవాడ : కాలానుగుణ ఆరోగ్య పరీక్షల ద్వారా ముందస్తుగా క్యాన్సర్‌ను
గుర్తించటం వల్ల తగిన చికిత్స అందించి ప్రాణపాయం నుండి కాపాడవచ్చని
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఆదివారం అసోషియేషన్ ఆఫ్
మినిమల్ యాక్సెస్ సర్జన్స్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన “ఎ డే విత్
మాస్టర్ ఇన్ సర్జరీ డాక్టర్ పళనివేలు” కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్
ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా “మినిమల్లీ ఇన్వేసివ్
క్యాన్సర్ సర్జరీ” పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా మరణాలకు క్యాన్సర్ కారణంగా మారిందని, ధూమపానం,
మద్యపానంతో సహా పర్యావరణ పరిస్ధితులు కూడా క్యాన్సర్‌కు ప్రధాన కారణంగా
ఉన్నాయన్నారు. నిరుపేదల వైద్యానికి ఉపకరించేలా పళని వేలు రూపొందించిన ఆధునిక
శస్త్ర చికిత్సా పద్దతులు అందరికీ అందుబాటులో ఉండాలన్నారు.
ప్రతిష్టాత్మకమైన డాక్టర్ బిసి రాయ్ జాతీయ అవార్డును రెండుసార్లు అందుకున్న
డాక్టర్ పళనివేలు ఘనతకు వైద్యరంగమంతా గర్విస్తోందన్నారు. క్యాన్సర్‌లో
పరిశోధనలు చేయడం, వైద్యులకు శిక్షణ అందించడం, పేద ప్రజలను సంరక్షించడం, ఆధునిక
ఆరోగ్య సంరక్షణను పొందలేని రోగులకు ఉచితంగా క్యాన్సర్ శస్త్రచికిత్సలు చేయడం
కోసం ఫౌండేషన్ ఏర్పాటు చేసిన పళనివేలు ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు.
ఇటీవల డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ద్వారా గౌరవ
డాక్టరేట్ అందుకున్న ప్రపంచ ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, క్యాన్సర్
సర్జన్ డాక్టర్ పళనివేలు గౌరవార్థం అసోసియేషన్ ఆఫ్ మినిమల్ యాక్సెస్ సర్జన్స్
ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక
ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్
సైన్సెస్ ఉపకులపతి అచార్య శ్యామ్ ప్రసాద్, జిఇఎం ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ
పళనివేలు, డాక్టర్ వర్గేష్, డాక్టర్ రెహమాన్, డాక్టర్ నరేంద్రరెడ్డి, డాక్టర్
పట్టాభి రామయ్య తదితరులు హాజరయ్యారు.