2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీలో క్యాన్సర్ చికిత్స కు రూ.600 కోట్లు
ఖర్చు
ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని
గుంటూరు : రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధి నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు
తీసుకుంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. గుంటూరు ప్రభుత్వ
ఆసుపత్రి నాట్కో క్యాన్సర్ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన నేషనల్ క్యాన్సర్
గ్రిడ్-ఆంధ్రప్రదేశ్ స్టేట్ చాప్టర్ వార్షిక సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా
పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు ఆసుపత్రి సిబ్బందితో నిర్వహించిన
సమావేశంలో ఆమె మాట్లాడారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు భరోసా, నాణ్యమైన
చికిత్స ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందన్నారు. ఆరోగ్యశ్రీ
పథకంలో క్యాన్సర్ చికిత్సలను కూడా చేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
కే చెందుతుందన్నారు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ లో ఎంప్యానల్ ఆసుపత్రుల సంఖ్య 919
నుంచి 2275 కు జగనన్న పెంచారన్నారు. 2019నుంచి ఐదు లక్షల వార్షిక ఆదాయం కలిగిన
వారికీ ఆరోగ్యశ్రీ పథకాన్ని తాము అమలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఆరోగ్య
శ్రీ లో 1059 వ్యాధులు కవర్ కాగా 3257 వ్యాధుల వరకు పెంచామన్నారు. 2022-23
ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీలో క్యాన్సర్ చికిత్స కు రూ.600 కోట్లు ప్రభుత్వం
ఖర్చు చేసిందన్నారు. దీంతో పెద్ద ఎత్తున క్యాన్సర్ ప్రొసీజర్లు
కవరయ్యాయన్నారు. 2.8 లక్షల కు పైగా క్యాన్సర్ రోగులకు చికిత్స అందించామన్నారు.
2019 నుండి 2020 వరకు దాదాపు 8.23 లక్షల మందికి క్యాన్సర్ చికిత్సను
అందించేందుకు రూ.1706.77 కోట్లు ఖర్చు చేశామన్నారు. మొదటి విడతగా ఏడు ప్రభుత్వ
మెడికల్ కాలేజీలలో రూ. 120 కోట్లతో అధునాతన క్యాన్సర్ పరికరాల్ని కొనుగోలు
చేయాలని నిర్ణయించామనీ మిగతా మెడికల్ కాలేజీల్లో కూడా రెండో విడతలో ఏర్పాటు
చేస్తామనీ మంత్రి రజిని తెలిపారు. అలాగే కర్నూలు లో స్టేట్ క్యాన్సర్ సెంటర్
ని నెలకొల్పేందుకు రూ.120 కోట్లు కేటాయించామన్నారు.
క్యాన్సర్ చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి క్యాన్సర్ చికిత్స
నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి రాకుండా ఉండేందుకు అవసరమైన అన్ని
చర్యలూ తీసుకోవాలన్న కృత నిశ్చయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పని
చేస్తున్నారన్నారు. కడప లో వంద పడకల క్యాన్సర్ ఆసుపత్రి కోసం రూ.107 కోట్లు
ప్రభుత్వం కేటాయించిందన్నారు. పేద ప్రజలెవరూ ఆర్థిక పరిస్థితి కారణంగా
క్యాన్సర్ చికిత్స కు దూరం కాకూడదన్నదే జగనన్న ఉద్దేశమన్నారు. నేషనల్
క్యాన్సర్ గ్రిడ్ మార్గ దర్శకాలను విజయవంతంగా అమలు చేసే దిశగా అందరమూ
కలిసికట్టుగా అంకిత భావంతో పనిచేయాలని మంత్రి రజిని పిలుపునిచ్చారు. ఎన్ సిజి
ఏపీ చాప్టర్ మొదటి వార్షికోత్సవం జరుపుకునే దిశగా టాటా మెమోరియల్ సంస్థ
సహకారాన్ని అందించడం పట్ల మంత్రి రజిని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
గుంటూరు నగర మేయర్ కావేటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య
విద్య రంగాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఆరోగ్య శ్రీ సిఇఓ హరేందిర
ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వై ఎస్ ఆర్ ఆరోగ్య శ్రీ కోసం కోట్లాది
రూపాయ ఖర్చు పెడుతోందన్నారు. డియంఇ డాక్టర్ నరసింహం, విశాఖ హోమీ బాబా
క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ ఉమేష్ మహాన్ శెట్టి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్
డాక్టర్ ఉమాజ్యోతి, జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి, జనరల్ సర్జరీ
హెచ్ ఓ డి డాక్టర్ వై కిరణ్ కుమార్, నాట్కో వైస్ ప్రెసిడెంట్ నన్నపనేని
సదాశివరావు, వైసీపీ మహిళా నాయకురాలు ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.