పాలిటెక్నిక్ టాపర్స్ కు అవార్డుల పంపిణీ
విజయవాడ : నైతిక విలువలు, క్రమశిక్షణతో కూడిన విద్య ఉజ్వల భవిష్యత్తుకు నాంది
అవుతుందని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమీషనర్, సాంకేతిక విద్యా శిక్షణా
సంస్ధ ఛైర్మన్ చదలవాడ నాగరాణి అన్నారు. అందుకు అనుగుణంగా విద్యాసంస్ధల
యాజమాన్యాలు, అద్యాపక, అధ్యాపకేతర సిబ్బంది కృషి చేయాలన్నారు. పాలిటెక్నిక్
విద్యలో రాష్ట్ర స్దాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్ధులకు ఆదివారం
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు లోని ఎఎఎన్ఎం, వివిఎఆర్ఎస్ఆర్ పాలిటెక్నిక్ లో
రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ శేషాద్రిరావు స్మారక అవార్డులను అంద చేశారు. ఈ
కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన నాగరాణి మాట్లాడుతూ మారుతున్న కాలమాన
పరిస్ధితులకు అనుగుణంగా విద్యార్ధులు ఆధునిక సాంకేతికను అలవరుచుకోవాలని,
లేకుంటే ప్రపంచీకరణ పరిస్ధితులలో వెనకబడి పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
నాడు శేషాద్రిరావు స్ధాపించిన ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ విద్యాసంస్ధలు
ఇప్పటికీ క్రమశిక్షణకు మారుపేరుగా గుర్తింపును కొనసాగిస్తున్నాయని, మరోవైపు
ర్యాంకుల పరంగానూ అగ్రగామిగా ఉండటం అభినందనీయమన్నారు. విధ్యాసంస్ధల ఛైర్మన్
డాక్టర్ వల్లూరుపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్ధుల సర్వతోముఖాభివృద్దే
ధ్యేయంగా పని చేస్తున్నామని, తమ సిబ్బంది అంకిత భావం వల్లే ఈ అగ్రస్ధానం
సాధ్యమైందని వివరించారు. కార్యక్రమంలో భాగంగా 2020, 2021,2022,2023 విద్యా
సంవత్సరాలకు సంబంధించి పాలిటెక్నిక్ విద్యలో రాష్ట్ర స్దాయి టాపర్ గా నిలిచిన
విద్యార్దులు సుంకర అశాలక్ష్మి, మానేపల్లి లహరి జయసాయి, బుద్దా రాజశేఖర్,
మచ్చా వెంకట దేదీప్యలకు నాగరాణి నగదు బహుమతి, ప్రశంశా పత్రాలను అందించారు. అదే
క్రమంలో కమీషనర్ సెల్ప్ ఫైనాన్సింగ్ పాలిటెక్నిక్ విద్యలో వరుసగా 2020, 2021,
2022, 2023 విద్యాసంవత్సరాలకు అగ్ర స్ధానంలో నిలిచిన బత్తు హేమలత, చినగంగారి
వైభవి, పర్వతనేని నిహారిక, నెల్లూరి సాయి పవన్ ఆదిత్య లకు నగదు, ప్రశంసా
పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ సమైఖ్యతను కాంక్షిస్తూ
విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.
కమీషనర్ పాలిటెక్నిక్ తో పాటు ఇంజనీరింగ్ కళాశాలను సైతం సందర్శించి
విద్యార్ధులకు అవసరమైన వసతుల కల్పన పట్ల యాజమాన్యం దూరదృష్టి
అభినందనీయమన్నారు. కార్యక్రమంలో విద్యాసంస్ధల సెక్రటరీ, కర్సస్పాండెంట్
వల్లూరుపల్లి సత్యనారాయణ రావు, సహ కార్యదర్శి వల్లూరుపల్లి రామకృష్ణ,
సాంకేతిక విద్యా శిక్షణా మండలి కార్యదర్శి రమణబాబు, సంయిక్త కార్యదర్శి జానకి
రామయ్య, సాంకేతిక విద్యా శాఖ ఉపసంచాలకులు విజయభాస్కర్, రామకృష్ణ తదితరులు
పాల్గొన్నారు.