శ్రీకాకుళం : క్రీడలు భారత దేశ సంస్కృతిలో భాగమని, వాటి అబివృద్దికి తమ
ప్రభుత్వం ప్రత్యేకమైన కృషి చేస్తున్నదని రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్
అధ్యక్షులు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. క్రీడలను జీవనోపాధి
మార్గంగా ఎంచుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాల్సిన వాతావరణాన్ని
నిర్మించాలని ఆయన సూచించారు. వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు జిల్లాలో
విజయవంతంగా నిర్వహిస్తున్న సందర్భంగా కోడి రామ్మూర్తి స్టేడియంలో జిల్లా
స్థాయి క్రీడాకారులకు ప్రత్యేక స్పోర్ట్స్ కిట్లను శనివారం సాయంత్రం ఆయన
అందజేశారు. జిల్లాలో మొత్తం 50 చోట్ల వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను
నిర్వహిస్తున్నామని చెప్పారు. దాదాపుగా 2000 మంది పలు క్రీడాంశాలలో
అంతర్జాతీయ స్థాయి తర్ఫీదు పొందుతున్నారని వివరించారు. ఈ సందర్భంగా సుమారు రూ.
రెండు లక్షలు విలువ చేసే కిట్లను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్
రెడ్డి సారధ్యంలో తమ ప్రభుత్వం క్రీడాభివృద్ధికి ఎన్నడూ లేనంతగా కట్టుబడి
ఉందని కృష్ణ దాస్ వివరించారు. సీఈవో ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ
కార్యక్రమంలో చీఫ్ కోచ్ శ్రీధర్, ఒలింపిక్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి
సుందర్రావు, కార్యదర్శి సాంబమూర్తి, పీఈటీల అసోసియేషన్ నుంచి పోలి నాయుడు,
పలువురు కోచ్ లు మాధురి, మణికంఠ, ఉమా, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.