బిపర్జాయ్ తుపానుతో అమిత్ షా తెలంగాణ పర్యటనపై సందిగ్ధత
హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్‌పై సందిగ్ధత
నెలకొంది. బిపర్జాయ్ తుపాను కారణంగా అమిత్ షా రాష్ట్ర పర్యటన రద్దయ్యే
అవకాశం కనిపిస్తుంది. అయితే హైదరాబాద్ పర్యటన లేకున్నా ఖమ్మం సభకు రావాలని
తెలంగాణ బీజేపీ నేతలు కోరుతున్నారు. కాగా ఖమ్మం కేంద్రంగా పాలిటిక్స్ హీట్
ఎక్కుతున్నాయి. జిల్లాపై జాతీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. ముందస్తు షెడ్యూల్
ప్రకారం బుధవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. 15న (గురువారం) ఉదయం
తెలంగాణకు చెందిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులతో ఆయన భేటీ కానున్నారు.
రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై అమిత్‌షా ఆరా తీయనున్నారు.
పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.
అనంతరం ముఖ్య నేతలు,పలువురు ప్రముఖులతో సమావేశమవుతారు. ఆర్ఆర్ఆర్ దర్శకుడు
ఎస్ఎస్ రాజమౌళిని కూడా కలవనున్నారు. తరువాత శంషాబాద్‌లోని జేడీ
కన్వెన్షన్‌లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ నాయకులతో, కేడర్‌తో ఆత్మీయ
సమావేశంలో పాల్గొననున్నారు. అక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయం ద్వారా
హెలికాప్టర్లో బయలుదేరి భద్రాచలం చేరుకుంటారు. సాయంత్రం రాములవారిని
దర్శించుకున్న తర్వాత హెలికాప్టర్లో బయలుదేరి ఖమ్మం చేరుకుంటారు. ఎన్టీఆర్
శతజయంతి సందర్భంగా ఖమ్మంలోని ఆయన విగ్రహానికి నివాళులర్పిస్తారు. ఖమ్మం
నగరంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా బహిరంగ సభకు హాజరవ్వాల్సి ఉంది. ‘మహాజన్
సంపర్క్ అభియాన్’ పేరిట రాష్ట్రంలోనే తొలి సభను ఖమ్మం వేదికగా
నిర్వహించనున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాట్లు
చేస్తోంది. జన సమీకరణ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. లక్ష మంది వరకు వస్తారని
ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఖమ్మం సభ వేదిక ద్వారా బిజేపీ ఎన్నికల
శంఖారావం పూరించే అవకాశం ఉంది. అయితే తాజాగా అమిత్ షా పర్యటనను ఇంకా ఫైనల్
చేయాల్సి ఉంది.