కేసీఆర్‌తో పాటు జాతీయ నేతల ఖమ్మం పర్యటన
ఖమ్మం : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు జాతీయ నేతల ఖమ్మం పర్యటన
కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం, ఖమ్మం
సమీకృత కలెక్టరేట్ భవనాన్ని వారు ప్రారంభించారు. భారాస ఆవిర్భావ సభకు
హాజరయ్యేందుకు దిల్లీ, పంజాబ్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరవింద్
కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్,
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా, పలువురు జాతీయ నేతలు ఇవాళ యాదాద్రి
చేరుకున్నారు. విజయన్, డి.రాజా మినహా మిగతా నేతలు యాదాద్రి శ్రీలక్ష్మీ
నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రధాన అర్చకులు, వేద పండితులు
సంకల్పం, సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. అనంతరం నేతలకు హారతి, తీర్థ
ప్రసాదాలు అందించారు. అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు.
నరసింహస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను నేతలు
తిలకించారు. ఆలయ విశిష్టత, ఆధునికీకరణకు సంబంధించిన వివరాలను నేతలకు సీఎం
కేసీఆర్ వివరించారు. స్వామివారి దర్శనం అనంతరం నూతనంగా నిర్మించి
అందుబాటులోకి తీసుకొచ్చిన ఖమ్మం సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్
ప్రాంరభించారు. కేజ్రీవాల్, పినరయి విజయన్, భగవంత్ మాన్, డి.రాజా,
అఖిలేశ్ యాదవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేరళ సీఎం విజయన్ చేతుల మీదుగా
కలెక్టరేట్ శిలాఫలకం ఆవిష్కరింపజేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా
తీసుకున్న రెండో విడత కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి పలువురికి
కళ్లద్దాలు అందించారు. కలెక్టరేట్లో కంటి వెలుగుకు సంబంధించి ఏర్పాటు చేసిన
ఫొటో ఎగ్జిబిషన్‌ను వారు తిలకించారు. ఈ సందర్భంగా కంటి వెలుగు కార్యక్రమం
గురించి మంత్రి హరీశ్‌రావు, సీఎస్ శాంతి కుమారి వివరించారు.