కీవ్ : దక్షిణ ఉక్రెయిన్ నగరమైన ఖేర్సన్, దాని పరిసర ప్రాంతాల నుంచి వైదొలగుతున్నట్లు రష్యా సైన్యం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాంతాలకు సరఫరాలు చేరవేయడం అసాధ్యమని రష్యా రక్షణ మంత్రి సెర్గే షొయిగుకు ఉక్రెయిన్లోని రష్యా సైనిక కమాండర్- జనరల్ సెర్గే సురోవికిన్ నివేదించిన దరిమిలా ఈ పరిణామం చోటుచేసుకుంది. దీనికి షొయిగు అంగీకరించి, బలగాలను ద్నీపర్ నదికి తూర్పు తీరాన మోహరించేందుకు ఆమోదం తెలిపారు. యుద్ధం మొదలైన ఎనిమిది నెలల తర్వాత ఇలా వైదొలగాల్సి రావడం పుతిన్ సైన్యానికి కొంత ఇబ్బందికర పరిస్థితే. దీనిని ఉక్రెయిన్ వర్గాలు వెంటనే ధ్రువీకరించలేదు. ఖేర్సన్ విషయంలో రష్యా ఇలాంటి ప్రకటన చేసి ప్రజలు రష్యా నియంత్రణలోని భూభాగాల్లోకి వెళ్లేలా పన్నాగం పన్నేలా ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవల అనుమానం వ్యక్తంచేశారు. రష్యా బలగాలు ఉక్రెయిన్లోని ఇతర ప్రాంతాలపై బుధవారం దాడుల్ని కొనసాగించాయి. డ్రోన్లు, రాకెట్లు, భారీ ఆయుధాలు, విమానాలతో 24 గంటల వ్యవధిలో రష్యా జరిపిన దాడుల్లో కనీసం 9 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ తెలిపింది.