తెలంగాణలో ప్రజాస్వామ్యమే లేదన్న కిషన్ రెడ్డి
ఒక కుటుంబం రాష్ట్రాన్ని పాలిస్తోందని విమర్శ
బీఆర్ఎస్ నుంచి నేర్చుకోవాల్సింది ఏమీ లేదు
న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మరోసారి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. బడ్జెట్ సమావేశాలకు ముందు పార్లమెంటు
ప్రాంగణంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రజాస్వామ్యమే లేదని ఆవేదన
వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ఒక కుటుంబం పాలిస్తోందని విమర్శించారు.
తెలంగాణలో విపరీతమైన అవినీతి చోటుచేసుకుంటోందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ
నుంచి తాము నేర్చుకోవాల్సింది ఏమీ లేదని అన్నారు. రాష్ట్రపతి, ప్రధాని,
గవర్నర్, ప్రతిపక్షాలకు గౌరవం ఇవ్వకుండా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని
కిషన్ రెడ్డి విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను అసెంబ్లీలోకి
అడుగుపెట్టకుండా అడ్డుకున్నారని, అసెంబ్లీ సమావేశాల మొత్తం సెషన్ నుంచి
బహిష్కరించారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని బీఆర్ఎస్ నేతలు అపహాస్యం
చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు వస్తున్న తరుణంలో మూడు, నాలుగు నెలల
తర్వాత వారి ఆటలన్నీ ఆగిపోతాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను
రాష్ట్ర ప్రజలు ఇంటికి పంపుతారని, ఆ తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ కే
అంకితమవుతారని అన్నారు.