నాలుగేళ్లలో 10,100 కోట్లు ఖర్చుపెట్టాం
ఈ ఒక్క ఏడాదిలోనే 3,400 కోట్లు ఖర్చుపెట్టాం
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని
గుంటూరు : రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమలుపై టీడీపీ ప్రధాన కార్యదర్శి
లోకేశ్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల
రజిని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ ఎలా అమలైంది?
వైసీపీ ప్రభుత్వంలో ఎలా అమలవుతోంది? అనే అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు
విసిరారు. గుంటూరులోని ఆర్అండ్బీ అతిథి గృహంలో మీడియా సమావేశంలో మంత్రి
మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు. ముఖ్యమంత్రి
జగన్ 3,250 వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చడంతో పాటు నాలుగేళ్లలో రూ.10,100
కోట్లు ఖర్చు చేశారు. చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకునే సమయంలో రోగులకు
రూ.2,500 నుంచి రూ.5 వేల వరకు చెల్లిస్తూ వారికి ఆసరా కల్పించారన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో రూ.5 లక్షల ఆదాయం లోపు వారిని ఆరోగ్యశ్రీలో చేర్చడంతో
1.42 కోట్ల మంది వైద్య సేవలు పొందారు. 638 క్యాన్సర్ కేసులకు రూ.600 కోట్లు
ఖర్చు చేయాలని నిర్ణయించాం. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏడాదికి రూ.1,000 కోట్లు
మాత్రమే ఖర్చు చేశారు. అప్పట్లో 919 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా రోజుకు
1,570 మంది వైద్య సేవలు పొందితే జగన్ ప్రభుత్వంలో 2,275 ఆస్పత్రుల్లో రోజుకు
3,400 మంది రోగులు వైద్యం పొందుతున్నారు ఆరోగ్యశ్రీ పథకం గురించి నిందలు,
అసత్యాలు ప్రచారం చేస్తున్నారని వివరించారు. ఇప్పటికీ ఆరోగ్యశ్రీ నెట్వర్క్
ఆస్పత్రులకు రూ.కోట్లలో నిధులు పెండింగ్‌లో ఉండటంతో పలు ఆస్పత్రుల నిర్వాహకులు
వైద్యం చేయడానికి నిరాకరించడంతో పాటు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని
కొందరు విలేకరులు మంత్రిని ప్రశ్నించగా, దశల వారీగా బిల్లులు
చెల్లిస్తున్నామని తెలిపారు. అలాంటి ఆస్పత్రుల గురించి ఫిర్యాదు చేస్తే విచారణ
చేసి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
దమ్ముంటే ఆరోగ్యశ్రీపై చంద్రబాబు,లోకేష్ చర్చకు రావాలి : ఆరోగ్యశ్రీపై
మాట్లాడే అర్హత చంద్రబాబు, లోకేష్‌కు లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి
విడదల రజిని మండిపడ్డారు. ఎవరి హయాంలో ఆరోగ్యశ్రీ ఎలా అమలైందో చర్చకు సిద్ధమా?
దమ్ముంటే ఆరోగ్యశ్రీపై చంద్రబాబు, లోకేష్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. గత
ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు. ఆరోగ్యశ్రీని
వెంటిలేటర్‌పై ఉంచారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిన వారి పేరైనా లోకేష్
చెప్పగలరా?. 3257 ప్రొసీజర్స్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చిన ఘనత సీఎం జగన్‌దని
మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టలేదు.
మా హయాంలో ఈ ఒక్క ఏడాదిలోనే 3,400 కోట్లు ఖర్చుపెట్టాం. నాలుగేళ్లలో 10,100
కోట్లు ఖర్చుపెట్టాం. వార్షికాదాయం 5 లక్షలు ఉన్న వారికి కూడా ఆరోగ్యశ్రీ అమలు
చేస్తున్నాం. మా హయాంలో 2275 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందుతుందని
మంత్రి విడదల రజిని పేర్కొన్నారు.