ఆక్వాసాగులో ఉత్పత్తి ఖర్చును తగ్గించేందుకు కృషి చేస్తున్నాం
ఆక్వా రైతులకు సరైన ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నాం
ఫిషరీస్ యూనివర్సిటికి 332కోట్ల రూ.లు మంజూరు-తొలివిడతగా 100కోట్లు విడుదల
బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ మొదటి కౌన్సిలింగ్ ఫలితాలు విడుదల
రాష్ట్ర మత్స్య,పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పల రాజు
అమరావతి సచివాలయం : రాష్ట్రంలో గత మూడేళ్ళ కాలంలో ఆక్వారంగ విద్యుత్ సబ్సిడీకి
2వేల 687 కోట్లు రూ.లను ఈప్రభుత్వం ఖర్చు చేయడం జరిగిందని రాష్ట్ర మత్స్య,పశు
సంవర్ధక శాఖామాత్యులు సీదిరి అప్పలరాజు వెల్లడించారు.ఆంద్రప్రదేశ్ మత్స్య
విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలైన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని
ముత్తుకూరు మత్స్యకళాశాలలో ‘బ్యాచలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (B.F.S.C)’ కోర్సులో
2022-23 విద్యా సంవత్సర ప్రవేశానికి ఎంపికైన అభ్యర్దుల జాబితాను గురువారం
అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో మంత్రి విడుదల చేశారు.ఈ
సందర్బంగా ఆయన మాట్లాడుతూ మత్స్య విశ్వవిద్యాలయ ప్రప్రధమ కౌన్సిలింగ్ లో
ఎంపికైన విద్యార్ధినీ విద్యార్ధులకు హర్ధిక శుభాకాంక్షలు
తెలిపారు.విద్యార్ధులంతా మత్స్యవిద్యను అభ్యసించి,మత్స్యరంగంలో కావలసిన
నైపుణ్యతను పొంది,రాష్ట్రంలో మత్స్య మరియు ఆక్వారంగ సుస్థిర అభివృద్ధికి కృషి
చేయాలని పిలుపు నిచ్చారు.దేశంలో తమిళనాడు,కేరళ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్టంలో
మత్స్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.రాష్ట్రానికి 972
కిలోమీటర్ల సుదీర్ఘ సముద్రతీరం కలిగి దేశంలోనే రెండవ అతిపెద్ద సముద్రతీరం
కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండడమే గాక దేశంలో ఉత్తత్పి అయ్యే ఆక్వా
ఉత్పత్తుల్లో 30శాతం ఆంధ్రప్రదేశ్ నుండే ఉందని పేర్కొన్నారు.అలాగే దేశానికి
ఆక్వా ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంలో 35శాతం అనగా సుమారు 20వేల కోట్ల రూ.ల
ఆదాయం ఆంధ్రప్రదేశ్ నుండే వస్తూ దేశంలో 3వ స్థానంలో ఎపి నిలిచిందని మంత్రి
అప్పల రాజు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని నర్సాపురం సమీపంలో ఏర్పాటు చేస్తున్న మత్స్య
విశ్వవిద్యాలయానికి గత నెలలో ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి శంఖుస్థాపన
చేయగా ఇందుకు 332 కోట్ల రూ.లు మంజూరు చేయగా ఇప్పటికే తొలివిడత కింద 100 కోట్ల
రూ.లు విడుదల చేశామని మంత్రి అప్పల రాజు వివరించారు.ఈ విశ్వ విద్యాలయ
ప్రాంగణంలోనే పిజి,డిప్లమా,కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని
చెప్పారు.అదే విధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు
తెలిపారు.ఆక్వారంగంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన మన రాష్ట్రంలో ప్రస్తుతం
నైపుణ్యత కలిగిన వారు,సాంకేతిక పరిజ్ణానం కలిగిన వారు తక్కువగా ఉన్నారని
రాష్ట్రంలో మత్స్య విశ్వ విద్యాలయం ఏర్పాటుతో ఆకొరత తగ్గుతుందని మంత్రి
వివరించారు.రాష్ట్రంలో 12వేల మంది వరకూ ఫిషరీస్ డిప్లమా హోల్డర్లు,6వేల118
మంది బిఎఫ్ఎస్సి,2వేల 500 మంది ఎంఎఫ్ఎస్సి గ్రాడ్యుయేట్లు ఉండాల్సి ఉందని
తెలిపారు.ఆక్వా రంగం అభివృద్ధికి సంబంధించి మత్స్య విశ్వవిద్యాలయం ఏర్పాటు
అనేది ఒక విప్లవాత్మకమైన చర్య అని మంత్రి ఈసందర్భంగా పేర్కొన్నారు.అంతేగాక
ఆక్వా రంగం అభివృద్ధికి ఈప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందనేందుకు ఇదే
నిదర్శనమని స్పష్టం చేశారు.
ఈప్రభుత్వం వచ్చాక గత మూడేళ్ళ కాలంలో ఆక్వారంగ విద్యుత్ సబ్సిడీకి 2వేల 687
కోట్ల రూ.లను ఖర్చు చేయడం జరిగిందని మంత్రి సీదిరి అప్పల రాజు స్పష్టం
చేశారు.ఆక్వా రైతులకు విద్యుత్ యూనిట్ రూ.1.50 పైసలకే అందించడం జరుగుతోందని
అన్నారు.గత ప్రభుత్వం ఆక్వా రైతులకు చెల్లించాల్సిన 309 కోట్ల రూ.లే విద్యుత్
సబ్సిడీని కూడా ఈప్రభుత్వం వచ్చాక చెల్లించిందని తెలిపారు.విద్యుత్ సబ్సిడీ
ఇవ్వడం వల్లే కోవిడ్ సమయంలో ఆక్వా రంగం నిలబడిందని మంత్రి ఈసందర్భంగా గుర్తు
చేశారు.10 ఎకరాల వరకూ సాగు చేసే ఆక్వా రైతులందరికీ విద్యుత్ సబ్సిడీని
అందిస్తామని ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని కావున ఆక్వా రైతులెవరూ ఆందోళన
చెందాల్సిన అవసరం లేదని మంత్రి అప్పల రాజు స్పష్టం చేశారు.
ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి ఖర్చును
తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి సీదిరి
అప్పలరాజు స్పష్టం చేశారు.ఆవిధంగా చేయడంతో గ్లోబల్ మార్కెట్లో పోటీని
తట్టుకుని నిలబడగలుగుతామని చెప్పారు.అలాగే ప్రీట్రేడ్ అగ్రిమెంట్ కోసం
కేంద్రాన్ని కోరుతున్నామని చెప్పారు.అంతేగాక ఆక్వా రైతులకు సరైన ధర వచ్చే
విధంగా హైపవర్ కమిటీ నిరంతరం పర్యవేక్షణ చేస్తోందని మంత్రి సీదిరి అప్పలరాజు
పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక,పాడి పరిశ్రమాభివృద్ది,మత్స్యశాఖ ముఖ్య
కార్యదర్శి డా.వై.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా
మరియు మత్స్య రంగాలకు ఉజ్వల భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు.ఈరంగాలలో నిపుణుల
కొరతను తీర్చేందుకు,ఆక్వారంగంలో గణనీయ అభివృద్ధి సాధనకు ఆంద్రప్రదేశ్
మత్స్యవిశ్వ విద్యాలయం ఎంతో దహదపడుతుందన్నారు.
మత్స్య విశ్వవిద్యాలయ ఓ.యస్.డి.మరియు రిజిస్ట్రారు ఓగిరాల సుధాకర్
మాట్లాడుతూ,ప్రవేశం పొందిన అభ్యర్ధులు ఈనెల 13వ తేదిలోగా ముత్తుకూరులోని
మత్స్య కళాశాలలో ఫీజులు చెల్లించి ప్రవేశం పొందాలని తెలిపారు. అదే విధంగా ఈ
నెల 17వ తారీఖున రెండవ కౌన్సిల్లింగ్ లిస్టు విడుదల చేయడం జరుగుతుందని అని
చెప్పారు.బ్యాచలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ (B.F.S.C) కోర్సులో ఈ
విద్యాసంవత్సరానికి 40 సీట్లు ఉన్నాయని వీటిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి 29
సీట్లు మరియు తెలంగాణ రాష్ట్రానికి 11 సీట్లు కేటాయించ బడినవని చెప్పారు.ఈ 40
సీట్లే కాకుండా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ న్యూఢిల్లీ వారి
కోటాలో 6 సీట్లు మరియు ఆర్ధికంగా వెనుకబడిన తరగతి(EWS) కోటాలో 3 సీట్లు అదనంగా
కేటాయించ బడినవని తెలిపారు.ఈ కోర్సులో ప్రవేశానికి అన్ని సామేజిక వర్గాలకు
సముచిత ప్రాముఖ్యత కల్పించేలా ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు రిజర్వేషన్
కల్పించడం జరుగుతుందని డా.సుధాకర్ చెప్పారు.బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్
(B.F.S.C) 4 సంవత్సరముల వృత్తి పరమైన కోర్సు చదివే విద్యార్ధినీ
విధ్యార్ధులకు ముత్తుకూరు మత్స్య కళాశాలలో వేరువేరుగా హాస్టలు వసతి కలదని
చెప్పారు.ఈ కోర్సు నాల్గో సంవత్సరము పూర్తిగా విధ్యార్ధులకు క్షేత్ర సంబంధ
నైపుణ్య అభివృద్ధి శిక్షణ కల్పిస్తారని తెలిపారు.ఈ కోర్సులో ఉత్తీర్ణులైన
వారికి మత్స్య మరియు ఆక్వా రంగాలలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలలో ఉపాధి
అవకాశాలు మెండుగా వున్నాయన్నారు.అలాగే స్వంతంగా పరిశ్రమలు నెలకొల్పుటకు మరియు
స్వయం ఉపాధి కల్పనకూ ఈ కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఇప్పటివరకు ఈ
కోర్సులో ఉత్తీర్ణులైన అభ్యర్ధులు అందరూ మత్స్య మరియు ఆక్వా రంగాలలో మంచి
ఉపాది పొందారని ఎవరూ నిరుద్యోగులగా లేరని తెలిపారు. ఈ కార్యక్రమంలో
విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాటి. వి.రమణ తదితరులు
పాల్గొన్నారు.