రూ. 2 వేల నోట్ల మార్పిడికి మనీ ఎక్స్చేంజీల నిరాకరణ
భారతీయ బ్యాంకుల్లోనే మార్చుకోవాలని సూచన
రూ. 2,000 నోటు ఉపసంహరణ విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు, భారత పర్యాటకులకు
కష్టాలు తెచ్చిపెడుతోంది. వాటిని మార్చుకునేందుకు ఆయా దేశాల్లోని మనీ
ఎక్స్చేంజీలు నిరాకరిస్తున్నాయి. ఫలితంగా నోట్ల మార్పిడి కోసం అష్టకష్టాలు
పడుతున్నారు. మరీ ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లోని మనీ ఎక్స్చేంజీలు నోట్లు
మార్చేందుకు నిరాకరిస్తున్నాయి. భారతీయ టూరిస్టుల నుంచి ఆ నోట్లను తీసుకుంటే
మళ్లీ తాము వాటిని మార్చుకోగలమో? లేదోనన్న అనుమానం వారిని వేధిస్తోంది.
అందుకనే ఎందుకొచ్చిన గొడవ అంటూ వాటిని తీసుకునేందుకు నిరాకరిస్తున్నాయి.
నోట్లను భారతీయ బ్యాంకుల్లోనే మార్చుకోవాలని చెబుతున్నాయని పర్యాటకులు
వాపోతున్నారు. దీంతో ఏం చేయాలో తమకు పాలుపోవడం లేదని వాపోతున్నారు. రూ. 2 వేల
నోటును చలామణి నుంచి ఉపసంహరిస్తుండడం వల్ల తమ వద్ద ఇప్పటికే పేరుకుపోయిన
నోట్లకు ఎక్స్చేంజ్ రేటు బాగా తగ్గిపోతోందని వారు భయపడుతున్నారని
తెలుస్తోంది. అందుకే కొత్తగా మళ్లీ రూ. 2 వేల నోటును తీసుకోవడం లేదని సమాచారం.