హైదరాబాద్: దాదాపు రెండు నెలల కసరత్తు అనంతరం గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న
రెండు నామినేటెడ్ స్థానాలకు అభ్యర్థులను మంత్రిమండలి ఎంపిక చేసింది. మాజీ
ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ, భారాస నేత దాసోజు శ్రవణ్‌ల పేర్లను ఆమోదించింది.
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో విస్తృతస్థాయి మథనం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు
తెలిసింది. వాస్తవానికి ఈ రెండు స్థానాలకు పదవీకాలం మే నెలాఖరుకే ముగియగా,
శాసనసభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎంపిక దృష్ట్యా ఆచితూచి వ్యవహరించాలని
మంత్రిమండలి నిర్ణయించింది. సామాజికవర్గాల వారీగా అధ్యయనం చేసి ఎస్టీ, బీసీ
సామాజికవర్గాలకు చెందిన కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌లను ఎంచుకున్నట్లు
తెలుస్తోంది. సీనియర్ నాయకులైన సత్యనారాయణ బీజేపీపై అసంతృప్తితో భారాసలో
చేరారు. ఈయనకు గతంలో కేసీఆర్‌తో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. దాసోజు శ్రవణ్
బీసీ నేతగా గుర్తింపు పొందారు. నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడేనికి
చెందిన దాసోజు శ్రవణ్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ప్రజారాజ్యం
తరఫున సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆయన
తర్వాత తెరాసలో చేరి పొలిట్‌బ్యూరో సభ్యుని స్థాయికి ఎదిగారు. 2014లో తెరాసకు
రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. 2018 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్
అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను వీడి 2022లో ఆగస్టులో బీజేపీ
లో చేరారు. అనంతర పరిణామాల్లో ఆ పార్టీని వీడి భారాసలో చేరారు.