ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన తమిళిసై
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆచార్య కోదండరాం, సియాసత్ పత్రిక ఎడిటర్ ఆమిర్ అలీఖాన్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికయ్యారు. వారిద్దరి పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించగా గవర్నర్ తమిళిసై గురువారం ఆమోదం తెలిపారు.
హక్కుల ఉద్యమం నుంచి. తెలంగాణ పోరాటం దాకా : ఆచార్య ముద్దసాని కోదండరాం స్వస్థలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నెన్నెల మండలం జోగాపూర్. 1955 సెప్టెంబరు 5న వెంకటమ్మ, ఎం.జనార్దన్ దంపతులకు జన్మించారు. హెచ్‌సీయూలో పీహెచ్డీ చేస్తున్నప్పుడు విద్యార్థి సంఘాన్ని స్థాపించి తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. అదే సమయంలో విద్యార్థుల సమస్యలపై నిరాహార దీక్ష చేశారు. ఓయూలో పొలిటికల్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం (ఏపీసీఎల్సీ), మానహక్కుల వేదిక(హెచ్ఆర్ఎఫ్)లలో క్రియాశీలకంగా పనిచేశారు. హక్కుల నేత బాలగోపాల్, ఆచార్య బియ్యాల జనార్దన్‌రావు, తెలంగాణ ఉద్యమకారులు ఆచార్య జయశంకర్, కేశవరావు జాదవ్‌తో కలసి వివిధ ఉద్యమాల్లో పనిచేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ)కి 2009 నుంచి రాష్ట్రం వచ్చేవరకు నాయకత్వం వహించారు. మిలియన్ మార్చ్, సాగరహారం లాంటి ఉద్యమాలకు నాయకత్వం వహించారు. సకల జనుల సమ్మె వంటి కీలకమైన ఉద్యమాలు ఆయన నేతృత్వంలోనే జరిగాయి. తెలంగాణ ఏర్పాటు తరువాత కూడా టీజేఏసీని కొనసాగించారు. 2018లో తెలంగాణ జన సమితి పార్టీని ఏర్పాటు చేశారు. 2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
పాత్రికేయ రంగంలో గుర్తింపు : ప్రముఖ ఉర్దూ దినపత్రిక సియాసత్ చీఫ్ ఎడిటర్ జావెద్ అలీఖాన్ కుమారుడైన ఆమిర్ అలీఖాన్ (50) పాత్రికేయ రంగంలో విశేష గుర్తింపు పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజంలో బ్యాచిలర్స్ డిగ్రీ పొందారు. సుల్తాన్ ఉల్ ఉలూమ్ కళాశాల నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఆంగ్లం, ఉర్దూ, హిందీ, అరబిక్, తెలుగు భాషల్లో ప్రావీణ్యం ఉంది. 1994 నుంచి పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నారు. వృత్తిలో భాగంగా రాష్ట్రపతి, ప్రధాన మంత్రిలతో దేశ, విదేశాల్లో విస్తృతంగా పర్యటించారు. 2002లో జర్మనీలోని గోథే ఇన్స్టిట్యూట్లో నిర్వహించిన అంతర్జాతీయ విజిటర్స్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లో భాగమయ్యారు. ప్రజా సమస్యలను ప్రతిబింబిస్తూ, రాజకీయ అంశాలను విశ్లేషిస్తూ ఆయన రాసిన వ్యాసాలు ప్రాచుర్యం పొందాయి. ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియాది కీలక పాత్ర అని ఆయన విశ్వసిస్తారు. మైనారిటీ వర్గాల ప్రయోజనాలను కాపాడడంలో ముందుంటారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ఆదివాసీలు, మైనారిటీలకు విద్య, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.