అమరావతి : ఉద్యోగుల జీతాలపై ప్రశ్నించిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంపై జగన్
సర్కార్ దూకుడు పెంచింది. సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లించడం లేదని,
ఉద్యోగుల పెండింగ్ బకాయిలు ఇవ్వటం లేదని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు
ఫిర్యాదు చేయడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నేరుగా గవర్నర్‌కు
ఫిర్యాదు చేసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కే.ఆర్ సూర్యనారాయణకు
సాధారణ పరిపాలన శాఖ (హెచ్ఆర్) నుంచి నోటీసులు జారీ చేశారు. ఉద్యోగుల
సమస్యలపై ఫిర్యాదు చేయడానికి అనేక వేదికలు ఉండగా, గవర్నర్ వద్దకు ఎందుకు
వెళ్లారంటూ నోటీసులిచ్చారు. క్రమశిక్షణా ఉల్లంఘన కింద ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల
సంఘాన్ని ఎందుకు రద్దు చేయకూడదంటూ నోటీసులో పేర్కొంటూ వారం రోజుల్లోగా సమాధానం
ఇవ్వాలంటూ నోటీసు జారీ చేశారు. కాగా ఈ నెల 19వ తేదీన జగన్ ప్రభుత్వంపై
ఫిర్యాదు చేసేందుకు రాజ్‌భవన్ కు ఏపీ ఉద్యోగ సంఘాల నాయకులు వెళ్లారు. ఏపీ
ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు సూర్యనారాయణ, కార్యదర్శి భాస్కరరావు, జనరల్ సెక్రటరీ,
వారితోపాటు మరో ఆరుగురు గురువారం ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసి
ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం సకాలంలో చెల్లించలేక
పోతోందంటూ ఫిర్యాదు చేశారు. కోట్లాది రూపాయల బకాయిలు, పెన్షన్ల చెల్లింపుకు
గవర్నర్ జోక్యం చేసుకోవాలని, లేకపోతే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడతారని,
ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, 15వ తేదీ వరకు
జీతాలు పడుతునే ఉంటాయని, పెన్షన్ల పరిస్థితి అలాగే ఉందని, ఈ అంశాలన్ని
గవర్నర్‌కు వివరించిన విషయం తెలిసిందే.
ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్న తాము సిద్ధమే
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ కు సాధారణ పరిపాలన
శాఖ నుంచి నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందించిన ఆయన సోమవారం మాట్లాడుతూ
ఉద్యోగుల సమస్యలపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసిన అనంతరం మీడియాతో
మాట్లాడినందుకు నోటీసులు ఇచ్చారన్నారు. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వమన్నారని,
అన్ని విషయాలతో వివరణ ఇస్తామన్నారు. ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్న తాము
సిద్ధమేనని స్పష్టం చేశారు. నిబంధనలు ఒక సంఘానికే పరిమితమవుతాయా? అని
ప్రశ్నించారు. నోటీసుల్లో ఆర్థికపరమైన చెల్లింపులపై షెడ్యూల్ ఇస్తే
బాగుండేదన్నారు. గవర్నర్ కూడా ప్రభుత్వంలో భాగమేనని సూర్యనారాయణ
వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కరబాబు
మాట్లాడుతూ కొన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ గుర్తింపు రద్దు చేస్తామంటే
ఆనందపడుతున్నారన్నారు. భవిష్యత్తులో ఇదే పరిస్థితి వాళ్లకు కూడా ఎదురవుతుందన్న
విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. నిబంధనలకు లోబడే గవర్నర్‌ను కలిశామని
చెప్పారు. గవర్నర్‌కు ఎటువంటి కంప్లైంట్ చేయలేదన్నారు. తమ సమస్యలను
పరిష్కరించమని కేవలం విజ్ఞప్తి మాత్రమే చేశామని చెప్పారు. మీడియాతో మాట్లాడిన
వారు అనేకమంది అనేక సంఘాల్లో ఉన్నారని, వాళ్లకు నిబంధనలు వర్తించవా? అని
ప్రశ్నించారు.