విజయవాడ : జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా గిరిజన
ప్రాంతాలకు అత్యాధునిక వైద్య సేవలు, శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయని
రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి
వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా సోమవారం పలు అంశాలు వెల్లడించారు.
వైద్యరంగానికి సంబంధించి గడిచిన రెండేళ్లలో ఏజన్సీ ప్రాంతంలో అనేక మార్పులు
చోటు చేసుకున్నాయని అన్నారు. పాడేరు ఆసుపత్రిలో 1522 అపరేషన్లు విజయవంతంగా
అక్కడి సిబ్బంది నిర్వహించి చరిత్ర సృష్టించారని అన్నారు. సిజేరియన్లు, కంటి
ఆపరేషన్లు, ఈ ఎన్ టీ వంటి అత్యాధునిక శస్త్రచికిత్సలు సైతం అక్కడే
నిర్వహించారని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో నిరంతరం మెరుగైన వైద్య సేవలు
అందించే లక్ష్యంతో పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించడం జరిగిందని అన్నారు.
100% ప్లేస్ మెంట్స్ తో రికార్డు సృష్టించిన విశాఖ ఐఐఎం
శతశాతం ప్లేస్ మెంట్స్ తో విశాఖ ఐఐఎం 2022-23 అకాడమిక్ సంవత్సరంలో సరికొత్త
రికార్డు సృష్టించిందని, ఈ ఘనత సాధించిన అధ్యాపకులకు, విధ్యార్దులకు విజయసాయి
రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఉద్యోగాలు సాధించిన వారిలో 25% మంది సగటున 20
లక్షలకు పైగా వార్షిక ప్యాకేజీ సాధించారని, 34% మంది ఐటీ కంపెనీలకు ఎంపిక
కాబడ్డారని తెలిపారు. మున్ముందు మరిన్ని విజయసాయి సాధించి రాష్ట్రానికి
గర్వకారణం కావాలని కోరారు.
ఆన్ లైన్ గేమింగ్ కంపెనీలను నియంత్రించాలి
ఆన్ లైన్ గేమింగ్ కంపెనీల దేశవ్యాప్తంగా ఫిర్యాదులు
వెల్లువెత్తుతున్నాయని వీటిని తక్షణమే కట్టడి చేయాలని విజయసాయి రెడ్డి
అన్నారు. ఇటువంటి కంపెనీలు భారతదేశ చట్టాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు
చేపట్టాలని డిమాండ్ చేశారు. గ్యాబ్లింగ్, బెట్టింగ్ కు సంబంధించిన చట్టాలు ఈ
ఆన్ లైన్ గేమింగ్ కంపెనీలకు వర్తింపజేయాలని కోరారు. పన్నులు ఎగ్గొట్టిన కొన్ని
కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు.