న్యూఢిల్లీ : భారత్లో మరో ఎన్నికల నగారా మోగింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సీఈసీ రాజీవ్ కుమార్ వివరాలు వెల్లడించారు. డిసెంబర్ 1న, 5న రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. 8 న కౌంటింగ్ జరిపి ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 182 శాసనసభ స్థానాలున్నాయని.. తొలి దశలో 89 స్థానాలకు, రెండో దశలో 93 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తామని సీఈసీ చెప్పారు.
నరేంద్ర మోడీ , అమిత్ షాకు కీలకం : ఫిబ్రవరి 18తో గుజరాత్ అసెంబ్లీ గడువు ముగియనుంది. ప్రస్తుతం బీజేపీకి 111, కాంగ్రెస్కు 62 సభ్యులున్నారు. ఇక తాజా ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్, ఆప్ మధ్య ఉండనుంది. ఇప్పటికే 100 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన ఆప్ ప్రచారంలో దూకుడు పెంచింది. మరోవైపు 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న కమలం పార్టీ మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమైంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ , హోంమంత్రి అమిత్ షాకు ఈ ఎన్నిక కీలకం కానుంది. సొంత రాష్ట్రంలో పట్టు కోల్పోకూడదని వీరిద్దరూ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో 4.90 లక్షల ఓటర్లున్నారు. 51,782 పోలింగ్ కేంద్రాలున్నాయి.