మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యుపీఎల్) తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్
సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు సత్తా చాటింది. శనివారం జరిగిన తొలి
మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. గుజరాత్
జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు ఐదు
వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. 208 పరుగుల లక్ష్యంతో
బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ జట్టు 15.1 ఓవర్లు మాత్రమే ఆడి 64 పరుగుల
స్వల్ప స్కోర్‌కే ఆలౌట్ అయింది. గుజరాత్ జెయింట్స్ జట్టు కెప్టెన్ బెత్ మూనీతో
సహా మరో ముగ్గురు డకౌట్‌గా వెనుదిరిగారంటే గుజరాత్ జట్టు బ్యాటింగ్ ఎంత
పేలవంగా సాగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముంబై జట్టు ఆల్‌రౌండ్ జట్టుతో
అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 15 పరుగుల స్కోర్‌కే యస్తికా
భాటియా వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత మ్యాథ్యూస్ 47 పరుగులు, నాట్ స్కివర్
బ్రంట్ 23 పరుగులతో నిలకడగా ఆడారు.
ముంబై జట్టు స్కోర్ 69 పరుగుల వద్ద ఉండగా నాట్ స్కివర్ బ్రంట్, 77 పరుగుల
వద్ద మ్యాథ్యూస్ ఔట్ కావడంతో 77 పరుగులకు ముంబై 3 వికెట్లు కోల్పోయింది. ఆ
తర్వాత అసలైన పరుగుల వరద మొదలైంది. ముంబై ఇండియన్స్ ఉమెన్ కెప్టెన్
హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటింగ్‌కు దిగి 14 ఫోర్లతో ప్రత్యర్థి జట్టు బౌలర్లకు
చుక్కలు చూపించింది. వరుసగా 7 ఫోర్లు కొట్టి హర్మన్ అంటే ఏంటో నిరూపించింది.
30 బంతుల్లోనే 65 పరుగులు చేసి కెరీర్లోనే గుర్తుండిపోయే హాఫ్ సెంచరీని నమోదు
చేసింది.
హర్మన్ దూకుడుకు గుజరాత్ బౌలర్లు బెదిరిపోయిన పరిస్థితి ఏర్పడింది.
స్నేహ్ రానా బౌలింగ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ హేమలతకు క్యాచ్‌గా దొరికిపోవడంతో
ఆమె అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. పూజా వస్త్రాకర్ 8 బంతుల్లో 3 ఫోర్లతో 15
పరుగులు చేసి ఔట్ అయినప్పటికీ కివీస్ ఉమెన్ క్రికెటర్ అమేలియా కెర్
దుమ్మురేపింది. 24 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్ బాది 45 పరుగులతో నాటౌట్‌గా
నిలిచి అదరగొట్టింది.