ఆరో విజయం కోసం పోచారం, దానం
మూడు సీట్ల నుంచి గెలిచిన బాజిరెడ్డి
హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తరఫున అసెంబ్లీ ఎన్నికల బరిలో
పలువురు ఉద్ధండులు పోటీ పడుతున్నారు. గెలవడం అలవాటుగా మార్చుకున్న కొందరు ఈ
సారి కూడా గెలిచి రికార్డు దిశగా పయణిస్తున్నారు. ఆరుసార్లు గెలిచిన
ఎర్రబెల్లి దయాకర్‌రావు, డీఎస్ రెడ్యానాయక్ ఏడో టర్మ్ గెలుపు దిశగా బరిలో
నిలిచారు. 1994 నుంచి వరుసగా ఓటమి ఎరగని నేతగా ఎర్రబెల్లి గుర్తింపు పొందారు.
నియోజకవర్గాల పునర్విభజనలో వర్ధన్నపేట నియోజకవర్గం ఎస్సీగా మారడంతో పాలకుర్తి
నుంచి పోటీ చేశారు. వర్ధన్నపేట నుంచి మూడుసార్లు, పాలకుర్తి నుంచి మూడుసార్లు
ఎర్రబెల్లి విజయం సాధించారు. ఇప్పుడు నాలుగోసారి కూడా పాలకుర్తి నుంచి బరిలో
నిలిచారు.
2008లో వరంగల్ ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఎర్రబెల్లి గెలుపొందారు.
లంబాడ సామాజికవర్గానికి చెందిన రెడ్యానాయక్ డోర్నకల్ నియోజకవర్గం నుంచి 1989
నుంచి 2004 వరకు జనరల్ స్థానంలో గెలుపొందారు. జనరల్ స్థానంలో ఎస్టీ
అభ్యర్థిగా గెలిచిన అరుదైన రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు. నియోజకవర్గాల
పునర్విభజనలో 2009లో డోర్నకల్ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్ క్యాటగిరీకి
మారింది. జనరల్ నియోజకవర్గంలో గెలుస్తూ వచ్చిన రెడ్యానాయక్.. ఎస్టీ
నియోజకవర్గంగా మారిన మొదటిసారి 2009లో ఓటమిపాలయ్యారు. ఆ తరువాత 2014, 2018లో
విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి రేసులో ఉన్నారు. రెడ్యానాయక్, ఎర్రబెల్లి
ఇద్దరూ సీఎం కేసీఆర్ తర్వాత అత్యంత సీనియర్ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో
ఉన్నారు.
ఆరో టర్మ్ గెలుపు దిశగా : అసెంబ్లీ ఎన్నికల్లో ఐదుసార్లు గెలిచి ఆరో టర్మ్
బరిలో నిలిచారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దానం నాగేందర్. దానం నాగేందర్
1994, 1999, 2004, 2009, 2018లో గెలిచారు. 2004లో టీడీపీ బీఫాంపై గెలిచి నెల
రోజుల్లోనే రాజీనామా చేశారు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్నారు. ఆయన బాన్సువాడ
నియోజకర్గం నుంచి గెలుపు పొందుతూ వస్తున్నారు. పోచారం 1994, 1999, 2009, 2014,
2018లో ఐదుసార్లు గెలుపొందారు. టీడీపీకి రాజీనామా చేసిన పోచారం ఎమ్మెల్యే
పదవికి రాజీనామా చేసి 2011లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ గెలిచారు.
రెండు నియోజకవర్గాల నుంచి గెలిచి : బీఆర్ఎస్ నుంచి టికెట్లు దక్కించుకున్న
వారిలో రెండు నియోజకవర్గాల నుంచి గెలిచిన వారు కూడా ఉన్నారు. కేసీఆర్
(సిద్దిపేట, గజ్వేల్), దయాకర్‌రావు (వర్ధన్నపేట, పాలకుర్తి), కొప్పుల ఈశ్వర్
(మేడారం, ధర్మపురి), సబితా ఇంద్రారెడ్డి (చేవెళ్ల, మహేశ్వరం), తలసాని
శ్రీనివాస్‌యాదవ్ (సికింద్రాబాద్, సతన్‌నగర్) ఉన్నారు.
మూడు స్థానాల నుంచి గెలిచిన బాజిరెడ్డి : రాష్ట్ర అసెంబ్లీలో సీఎం కేసీఆర్
తరువాత బాజిరెడ్డి గోవర్ధన్‌ది ఒక ప్రత్యేకత. అసెంబ్లీ చరిత్రలో ఒకే వ్యక్తి
మూడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి గెలిచిన చరిత్ర ఆయనది. కాంగ్రెస్‌లో రాజకీయ
ప్రస్థానం మొదలుపెట్టిన బాజిరెడ్డి తొలిసారిగా 1994లో ఆర్మూర్ నియోజకవర్గం
స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థిగా సంతోష్‌రెడ్డికి
టికెట్టు దక్కింది. సంతోష్‌రెడ్డి మూడో స్థానం నిలవగా బాజిరెడ్డి
రెండోస్థానంలో నిలిచారు. 1999లో అదే ఆర్మూరు నుంచి టీడీపీ అభ్యర్థి
అన్నపూర్ణదేవిపై బాజిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 2004లో
బాన్సువాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి పోచారం
శ్రీనివాస్‌రెడ్డిపై గెలుపొందారు. 2009లో బాన్సువాడ నుంచి కాంగ్రెస్
అభ్యర్థిగా బాజిరెడ్డి పోచారంపై ఓటమి పాలయ్యారు. 2014, 2018లో నిజామాబాద్
రూరల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందారు. 2014లో
కాంగ్రెస్ అభ్యర్థి డీ శ్రీనివాస్‌పై గెలుపొందారు. ఇప్పుడు బాజిరెడ్డి
ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుపు బరిలో నిలబడనున్నారు.