చండీగఢ్ : అపరిచితులు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసే సంఘటనలు చాలా
సినిమాల్లో కనిపిస్తుంటాయి. అదే విధంగా ఓ గ్యాంగ్స్టర్ ఓ వ్యక్తికి ఫోన్
చేసి రూ.1 కోటి సిద్ధం చేసుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి
వస్తుందని బెదిరించాడు. చిరు వ్యాపారం చేసుకునే ఆ వ్యక్తి పోలీసులను
ఆశ్రయించటంతో అసలు విషయం బయటపడింది. ఆ వ్యక్తికి కాల్ చేసింది అతడి మనవడే. ఈ
సంఘటన పంజాబ్లోని పటాన్కోట్లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం ఫిర్యాదు
దారు తన దుకాణం నుంచి ఇంటికి తిరిగి వచ్చి రాత్రి 8.50 గంటల ప్రాంతంలో టీవీ
చూస్తుండగా ఫోన్ కాల్ వచ్చింది. తాను ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నానని, తనకు
‘ఖోఖా’ (రూ.1కోటి) ఇవ్వాలని లేదా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని
బెదిరించాడు. ఆ మాట విని ఆందోళన చెందిన పెద్దాయన వెంటనే ఫోన్ కట్ చేశాడు. ఆ
తర్వాత మళ్లీ ఫోన్ చేశాడు. దీంతో భయాందోళన చెందిన ఆ వృద్ధుడు కుటుంబ సభ్యులకు
తెలిపాడు. వారి ప్రోత్సాహంతో షాపుర్ కండీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘నేను
ఆశ్చర్యపోయా, నేను పెద్ద వ్యాపారవేత్తను కాదు. నాకు భూములు, ఇతర ఆస్తులు లేవు.
గ్యాంగ్ స్టర్ నాకేందుకు ఫోన్ చేశాడని ఆశ్చర్యమేసిందని బాధితుడు తెలిపారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ నంబర్ ఆధారంగా గ్యాంగ్స్టర్ను
గుర్తించి అరెస్ట్ చేశారు. అతడు బాధితుడి మనవడే అని తేలింది. తన తాతను
బెదిరించేందుకు కొత్త సిమ్ కొనుగోలు చేసినట్లు గుర్తించామని డిప్యూటీ సబ్
ఇన్స్పెక్టర్ రాజిందర్ మంహాస్ తెలిపారు. నిందితుడిపై పలువు సెక్షన్ల కింద
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు.