అమలు చేయడానికి త్వరలో ఆర్డినెన్స్ జారీ చేస్తున్నట్లు సిఎం జగన్ ప్రకటించారు.
విజయవాడలో ఏపీఎన్జీవో మహాసభల్లో త్వరలోనే ఆర్డినెన్స్ ఆమోదం పొందనుందని
వెల్లడించాచారు. ఏళ్ల తరబడి పరిష్కారం చూపకుండా గాలికొదిలేసిన సీపీఎస్ సమస్యను
పరిష్కరించడానికి మనసు పెట్టి, నిజాయితీగా తాము ముందుకెళుతున్నామని చెప్పారు.
చిత్తశుద్ధితో అనేక సమావేశాలు, ఆలోచనలు చేసి, ఏడాదిన్నర అధ్యయనం తర్వాత
దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆధర్శంగా ఉద్యోగులకు అనుకూలంగా గ్యారంటీ పెన్షన్
స్కీమ్ తెచ్చామన్నారు. పెన్షన్ల చెల్లింపులో ప్రభుత్వం మీద అసాధ్యమైన భారం
పడకుండా, ప్రభుత్వాలు భవిష్యత్తులో చేతులెత్తేసే పరిస్థితి రాకుండా, ఉద్యోగుల
రిటైర్మెంట్ తర్వాత కూడా మంచి చేయాలని జిపిఎస్ ను ఆర్డినెన్స్ రూపంలో
తెస్తున్నట్లు చెప్పారు. మాట తప్పే ఉద్దేశం ఉంటే ఈ ఆర్డినెన్స్ తెచ్చే వారిమి
కాదన్నారు. జిపిఎస్ విషయంలో తాను అత్యధిక సమయం వెచ్చించినట్టు చెప్పారు.
పెన్షన్ స్కీమ్ రాబోయే రోజుల్లో దేశమే మన దేశాన్ని కాపీ కొట్టి అమలు చేసే
రోజులు వస్తాయన్నారు. ఉద్యోగులు వారి రిటైర్మెంట్ తర్వాత మంచి చేయాలనే తలంపుతో
తెచ్చిన స్కీమ్ అని, అదే సమయంలో ప్రభుత్వాలపై భారం పడకుండా బ్యాలన్స్
చేస్తుందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 2019 వరకు రాష్ట్ర ప్రభుత్వంలో
నాలుగున్నర లక్షల ఉద్యోగులు ఉంటే 2019 నుంచి 2.30లక్షల మందిని కొత్తగా
ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకున్నట్టు చెప్పారు. ప్రజలకు మంచి చేయాలనే తపనతోనే
తాము పనిచేస్తున్నట్లు చెప్పారు.
ఉద్యోగులే వారధులు : ఏపీ ఎన్జీవోల సంఘం 21 రాష్ట్ర మహాసభల్ని విజయవాడ
ఇందిరాగాంధీ స్టేడియంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.
సంక్షేమాన్ని అందించడంలో, అభివృద్ధిని పంచిపెట్టడంలో, సేవా ఫలాలను ప్రజలకు
తీసుకెళ్లడంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఉద్యోగులు వారధులని కొనియాడారు.
నిర్ణయాలు తీసుకునేది రాజకీయ వ్యవస్థ, ముఖ్యమంత్రి అయినా దానిని అమలు చేసేది,
ప్రజలకు కావాల్సిన పౌరసేవల్ని తీసుకెళ్లేది మాత్రం ఉద్యోగుల భుజస్కందాలపై
జరుగుతుందన్నారు. ఉద్యోగుల సంతోషం, భవిష్యత్తు కూడా ప్రభుత్వ ప్రాధాన్యతలే
అన్నారు. అది తన భాధ్యత అని చెప్పారు. ప్రభుత్వమనే కుటుంబంలో కీలక సభ్యులైన
అందరిపై అభిమానం, ప్రేమ, నిజాయితీ చాటే విషయంలో గతంలో ఉన్న ఏ ప్రభుత్వంతో
పోల్చినా అంతకంటే మిన్నగా ఉద్యోగుల విషయంలో సానుకూలంగా ఉందన్నారు. ఉద్యోగులకు
సంబంధించి ఎంత మిన్నగా ప్రభుత్వం ప్రవర్తిస్తుందో వివరించారు. 2019లో
అధికారంలోకి వచ్చినప్పటి పరిస్థితులు ఉద్యోగులకు తెలుసని, ప్రభుత్వ ఉద్యోగ
వ్యవస్థ మీద ఉన్న ఒత్తిడి తగ్గిస్తూ, సేవలను గ్రామ స్థాయిలో అందుబాటులో
వచ్చేలా అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలోనే ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో 1.35లక్షల
శాశ్వత ఉద్యోగాలను ప్రతి గ్రామం, మునిసిపాలిటీ వార్డులో ఏర్పాటు చేశామన్నారు.
ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేయడం అంతా అసాధ్యమన్నా, ఉద్యోగులకు ఇచ్చిన
మాట నెరవేర్చామన్నారు. పదవీ విరమణ వయసు 60నుంచి 62ఏళ్లకు పెంచామన్నారు. గత
ప్రభుత్వ హయంలో అతి తక్కువ జీతాలకు పనిచేస్తున్న, ఎన్నికలకు ఆర్నెల్ల ముందు
కూడా ఒక్కరుపాయి కూడా జీతాలు పెరగని వర్గాలకు జీతాలు పెంచినట్టు చెప్పారు.
నాలుగున్నర ఏళ్లు వారికి జీతాలు పెంచాలనే ఆలోచన కూడా చేయలేదన్నారు. ఎన్నికలకు
ఆర్నెల్ల ముందు ఓట్లు వేయించుకోవాలనే దుర్బుద్ధితో జీతాలు పెంచారని,
అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన జీతాలను చెల్లిస్తున్నట్లు చెప్పారు. అంగన్
వాడీలు, విఏఓలు, శానిటేషన్ కార్మికులు, గిరిజన కార్మికులు, మధ్యాహ్న భోజనం
అయాలు, హోమ్గార్డుల జీతాలను పెంచామన్నారు. రూ.1100కోట్ల రుపాయల జీతాలు ఇప్పుడు
రూ.3300కోట్లకు పెంచామన్నారు. కోవిడ్ సమయంలో రాష్ట్ర సొంత ఆదాయం తగ్గినా,
ఖర్చులు భారీగా పెరిగినా, నిరుపేదలందరిని బతికించుకునేందుకు ప్రత్యక్ష నగదు
బదిలీ పథకాలను గతంలో ఎప్పుడు చూడని విధంగా అమలు చేసినట్లు చెప్పారు. లంచాలకు
తావు లేకుండా సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు చెప్పారు.
ప్రజలు సంతోషంగా ఉన్నారు : ప్రజల ముఖంలో చిర్నవ్వుతో ఉండటానికి ఉద్యోగులే
కారణమని సిఎం చెప్పారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రజల్ని వదిలేయకుండా,
ఉద్యోగుల పట్ల మానవత్వం సడలకుండా వ్యవహరించామని చెప్పారు. గత ప్రభుత్వాలు
పట్టించుకోని ఆర్టీసీ కారుణ్య నియామకాల విషయంలో, 10వేల కాంట్రాక్టు ఉద్యోగుల
క్రమబద్దీకరణ విషయంలో, ఏపీ వైద్య విధాన పరిషత్ 14,658మంది సొసైటీ పరిధి నుంచి
ప్రభుత్వంలోకి తీసుకున్నామని చెప్పారు. జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులకు 16శాతం
హెచ్ఆర్ఏ చెల్లించే విషయంల, ఆర్టీసిని బతికించడం కోసం 55వేల మంది కార్మికుల్ని
క్రమబద్దీకరించడం చేశామని గుర్తు చేశారు. 1998 డిఎస్సీ అభ్యర్థులకు 25ఏళ్ల
తర్వాత ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేశామని, బాషా పండిట్లకు స్కూల్ అసిస్టెంట్
ప్రమోషన్లు, ఎంఈఓలకు ప్రమోషన్లు ఇవ్వడంలో ఎవరికి అన్యాయం చేయలేదన్నారు.
కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ చెల్లింపులు తామే ప్రారంభించినట్లు
గుర్తు చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని ఆప్కాస్ పరిధిలోకి తెచ్చామన్నారు.
ప్రతి ఒక్కరికి అండగా నిలిచామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థల్ని
విస్తరిస్తున్నామని, పనిఒత్తిడి, పనుల విషయంలో గతానికి ఇప్పటికి తేడా
గుర్తించాలన్నారు. గతంలో ఎన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగులు ఉండేవారో
గుర్తు చేసుకోవాలన్నారు. గ్రామ స్థాయిలో ఎన్ని కార్యాలయాలు ఉన్నాయో
చెప్పాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ఆర్బీకేలు, విలేజీ క్లినిక్లు,
డిజిటల్ లైబ్రరీలు, నాడునేడుతో రూపుమారిన స్కూల్స్ చూడగలుగుతున్నామని చెప్పారు.