ప్రభుత్వం సమ సమాజ స్థాపన కోసం సీఎం వైయస్ జగన్ కృషి పట్టభద్రులంతా సీఎం
విశాల దృక్పథం గమనించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజ్ఞప్తి
చేశారు. ప్రాంతీయ అసమానతలు రూపు మాపడమే లక్ష్యమని, అందుకే విశాఖలో
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌పై నిర్ణయం తీసుకున్నట్లు సమావేశంలో వైఎస్సార్సీపీ
నేతలు స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త
వైవీ సుబ్బారెడ్డి సారథ్యంలో విశాఖపట్నంలో సమావేశం నిర్వహించారు. సమావేశం
అనంతరం వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స
సత్యనారాయణమీడియాతో మాట్లాడారు.తొలుత వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ
ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీతంరాజు సుధాకర్‌ను
పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ ఇరవై రోజులు పార్టీ నాయకులు అయా
నియోజకవర్గాల్లో ఓటర్లను కలిసి మెజార్టీ సాధించే దిశలో పని చేయాలి. ఉత్తరాంధ్ర
పట్టభద్రుల ఎన్నికల కోసం ఈరోజు నుంచి విశాఖలో వైయస్సార్సీపీ ప్రత్యేక
కార్యాలయం అందుబాటులో ఉంటుందన్నారు.
రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీతంరాజు సుధాకర్‌ను బలపరుస్తూ నిర్ణయం తీసుకున్నాం.
ఆయనను గెలిపించుకుని ఈ ప్రాంతానికి మా పార్టీ, ప్రభుత్వం ఇస్తున్న
ప్రాధాన్యతను అందరూ గుర్తించేలా చేయాలని నిర్ణయించాం. అనేక దశాబ్ధాలుగా
వెనకబడి ఉన్న ఈ ప్రాంత అభివృద్ధి కోసం సీఎం వైయస్ జగన్ కీలక నిర్ణయాలు
తీసుకున్నారు. అందులో భాగంగానే విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిట్ ఏర్పాటు
చేయాలని నిర్ణయించారు. సామాజిక అసమానతలు, ప్రాంతాల మధ్య వ్యత్యాసాలను పూర్తిగా
మార్చడం కోసం మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పట్టభద్రులు
గుర్తించాలన్నారు. అలాగే మాయమాటలు చెప్పి నమ్మించాలనే వారి మాయలో మీరు
పడిపోవద్దు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో మేము తప్పనిసరిగా విజయం
సాధిస్తామన్నారు
విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఈసీ సమావేశాలు పెట్టుకుంటుంది.
అది నిరంతర ప్రక్రియ. చేత కాని వాడు ఫిర్యాదు చేయక ఇంకేం చేస్తాడు?. మేం
ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించం. ఎప్పుడూ చట్టబద్ధంగా నడుచుకుంటాం. ఈ ఎన్నికల్లో
200 శాతం మేం గెలుస్తాం. అలాంటప్పుడు రాజధాని అంశాన్ని రెఫరెండంగా ఎందుకు
తీసుకోవాలి?. పచ్చ మీడియా ఎప్పుడూ మాపై దుమ్మెత్తి పోస్తుంది కాబట్టి, మేము ఈ
ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. గతంలో మా అభ్యర్థిని ప్రకటించలేదు.
ఇప్పుడు మాకు అభ్యర్థి ఉన్నాడన్నారు.