గుడివాడ : గ్రామీణ క్రీడాకారుల ప్రతిభ వెలికితీతే ప్రధాన
లక్ష్యమని, విద్యార్థులకు చదువు ఒక్కటే ముఖ్యం కాదని, క్రీడలు సైతం జీవన
విధానంలో ముఖ్య భాగం కావాలని క్రీడల వల్ల ఆరోగ్యం, ఆనందం ప్రాప్తిస్తుందని
మచిలీపట్నం పార్లమెంటరీ సభ్యుడు వల్లభనేని బాలశౌరి పిలుపునిచ్చారు. శనివారం
ఆయన కృష్ణాజిల్లా గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ
నిర్వహణలో జిల్లా స్థాయి జగనన్న క్రీడా సంబరాలు 2022 లాంచలంగా ప్రారంభించారు.
కృష్ణాజిల్లా నుంచి గుడివాడ మచిలీపట్నం పెడన అవినిగడ్డ పామర్రు, పెనమలూరు,
గన్నవరం నియోజకవర్గాలకు చెందిన పలువురు క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా ఏపీ సీఎం
50 లక్షల ప్రైజ్ మనీ టోర్నమెంట్లో పాల్గొన్నారు. తొలుత జెండా వందనం అనంతరం
పలువురు క్రీడాకారులతో మార్చ్ ఫాస్ట్ స్టేడియంలో నిర్వహించారు తొలి రోజు
కబడ్డీ, వాలీబాల్ పోటీలు పలు జట్ల మధ్య హారాహోరీగా సాగాయి. ఆదివారం నుంచి ఏడు
నియోజకవర్గాల నుంచి క్రికెట్ జట్లు పోటీ పడనున్నాయి. ఈ సందర్భంగా మచిలీపట్నం
పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి సభను ఉద్దేశించి మాట్లాడుతూ,
క్రీడాకారులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంటుందన్నారు. ఆటల్లో ఎవరైతే
ఎక్కువగా పాల్గొంటారో వారే అత్యధిక శాతం జీవితంలో రాణిస్తారని ఎటువంటి
సమస్యనైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఎట్టి పరిస్థితుల్లోనైనా
తాను విజేత ఆవ్వాలని పట్టుదల క్రీడల ద్వారా బలంగా పెంపొందుతుందన్నారు. కేంద్ర
రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాకారులను ఎంతో ప్రోత్సహిస్తుందన్నారు రక్షణ రంగం,
రైల్వే శాఖ, బ్యాంకులు తదితర సంస్థల్లో స్పోర్ట్స్ కోటా అమలు చేసి
క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే
విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం
సరికొత్త విధానం ప్రవేశ పెడుతుందన్నారు. దీంతో క్రీడలకు మళ్లీ పూర్వ వైభవం
రాబోతుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల్లో సైతం మార్పు రావాలని, తమ
పిల్లలను కేవలం విద్యకే పరిమితం చేయకుండా ప్రతి విద్యార్థి ఏదో ఒక క్రీడలో
నైపుణ్యం సాధించేలా శిక్షణ ఇప్పించాలని కోరారు. గ్రామీణ స్థాయి నుంచి కబడ్డీ,
వాలీబాల్, క్రికెట్ తదితర క్రీడల్లో శిక్షణ పొంది జిల్లా స్థాయి పోటీల్లో
తలపడుతున్న క్రీడాకారులు గెలుపు ఓటములను సమాన దృష్టితో స్వీకరించి
క్రీడాస్ఫూర్తిని కనబరచాలని సూచించారు. కృష్ణాజిల్లా లోని ఏడు నియోజకవర్గాల
క్రీడాకారులకు ఎంపీ బాలశౌరి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ
మంత్రివర్యులు, గుడివాడ శాసనసభ్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని),
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ
ఉపాధ్యక్షుడు పాలేటి వెంకట శివ సుబ్రహ్మణ్యేశ్వర రావు ( చంటి), సంయుక్త
కార్యదర్శి పర్వతనేని ఆనంద్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు పేర్ని
కృష్ణమూర్తి ( కిట్టు), రాష్ట్ర సంచార జాతుల కమిషన్ సభ్యులు షేక్ సయ్యద్,
రాష్ట్ర వైఎస్సార్ సీపీ పార్టీ నాయకులు దుక్కిశెట్టి శశిభూషణ్, టిడ్కో స్టేట్
డైరెక్టర్ చిన్నారి, ఎన్టీఆర్ స్టేడియం మేనేజర్ ఎం. సత్యనారాయణ, గుడివాడ
డి.ఎస్.పి ఎన్. సత్యానందం, ఆర్డిఓ పి పద్మావతి, మున్సిపాలిటీ చైర్మన్ వి.
మురళీకృష్ణ. తహసిల్దార్ కె. ఆంజనేయులు, సాఫ్ జిల్లా చీఫ్ కోచ్ కే. ఝాన్సీ
లక్ష్మి, ఎన్టీఆర్ స్టేడియం వాలీబాల్ కోచ్ ఎస్. సంతోష్ కుమార్, తోట అజయ్,
భాష్యం, చిన్నం బాబురావు, రమేష్, తాతయ్య తదితర వ్యాయామ ఉపాధ్యాయులు, అధికారులు
ప్రజాప్రతినిధులు వైయస్సార్సీపి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.