విజయవాడ : గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా 24
గంటలూ వైద్య ఆరోగ్య సేవలందించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ముందుందని
రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి
పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా సోమవారం పలు అంశాలను వెల్లడించారు. పీహెచ్
సీల 24 గంటల వైద్యసేవల్లో దేశంలో సగటు 45.1% ఉంటే ఆంధ్రప్రదేశ్ 100% ఉందని ఈ
విషయాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పార్లమెంటుకు వెల్లడించిందని
అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైద్యరంగంలో చేపట్టిన ఆసుపత్రులు
ఆధునికీకరణ, కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్,
అర్బన్ సెంటర్ల ఏర్పాటు వంటి విప్లవాత్మక సంస్కరణలతో ఆంధ్రప్రదేశ్
రాష్ట్రం వైద్యసేవల్లో దేశంలోనే అగ్రగామిగా ఉందని అన్నారు.
పారిశ్రామిక వృద్ధి రేటులో దేశంలోనే ఏపీ టాప్
2021-22లో దేశంలోనే అత్యధికంగా 12.78% పారిశ్రామిక వృద్ధి రేటుతో ఆంధ్ర
ప్రదేశ్ అగ్రభాగాన నిలిచిందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. సులభతర వాణిజ్య
ర్యాంకుల్లో వరుసగా మూడేళ్లుగా ఏపీ దేశంలోనే మొదటి ర్యాంకు సాధిస్తూ చరిత్ర
సృష్టించిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర
ప్రాంతంతో మలేషియా, సింగపూర్ వంటి తూర్పు దేశాలకు ముఖద్వారంగా ఉందని,
ప్రస్తుతం ఉన్న 6 పోర్టులకు అదనంగా మరో 4 పోర్టులు నిర్మాణం జరుగుతోందని
అన్నారు. అలాగే పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు, అందుబాటులో 46555 ఎకరాల భూమితో
పరిశ్రమల స్థాపనకు ఆంధ్రప్రదేశ్ ఎంతో అనుకూలంగా ఉందని అన్నారు.
పీఎం కిసాన్ పథకంతో రైతులకు లబ్ధి
పీఎం కిసాన్ పథకం కింద ప్రధాని నరేంద్ర మోదీ 16800 కోట్లు విడుదల చేసి వ్యవసాయ
రంగానికి చేయూత అందించారని విజయసాయి రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా 8 కోట్ల
మంది రైతులు ఆర్థిక సహకారాన్ని అందుకున్నారని అన్నారు. ఒక్కో రైతు ఖాతాలో రూ.
2000 జమ అయ్యాయని అలాగే ఈ పథకం కింద అర్హత గల రైతులు సంవత్సరానికి రూ.6000
లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు.
ప్లాస్టిక్ నిషేధంలో ఏపీ ఆదర్శం
ప్లాస్టిక్ సంచులు వాడకాన్ని నిషేధించి క్లాత్ బ్యాగులను వినియోగించాలని
ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన విజ్ఞప్తిని అభినందిస్తున్నానని
విజయసాయి రెడ్డి అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులు, ప్లాస్టిక్
ఫ్లెక్సీల వాడకాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యావరణ నష్ట నివారణ
చర్యల్లో దేశంలోనే ముందుందని అన్నారు. అయితే వీటిపై ఆధారపడ్డ వ్యాపారులకు
ప్రత్యామ్నాయాలు ఆదాయ మార్గాలు కల్పించి వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం
సహకారం అందించాలని ఆయన కోరారు.