ఘనంగా కౌశల్ 2022 అవార్ఢుల ప్రధానోత్సవం
విజయవాడ : గ్రామీణ విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు కౌశల్
పోటీ పరీక్ష గొప్ప వేదిక అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరి
చందన్ అన్నారు. విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్ వేదికగా శుక్రవారం
నిర్వహించిన కౌశల్ – 2022 అవార్డుల ప్రదాన కార్యక్రమానికి గవర్నర్
ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మారుతున్న సాంకేతికత
అధారంగా డిజిటల్ విధానంలో ఆన్లైన్ పరీక్షను నిర్వహించడం ఎంతో అభినందనీయం
అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘ఆజాదీ కా
అమృత్ మహోత్సవ్’ జరుపుకుంటున్న తరుణంలో కౌశల్ – 2022 కార్యక్రమం మరింత
ప్రాముఖ్యతను సంతరించుకుందన్నారు. బ్రిటీషర్లు సృష్టించిన ప్రతికూల
వాతావరణంలో, మన జ్ఞాన వ్యవస్థలు నాశనం అయిన నేపధ్యంలో స్వంత విద్యా నమూనాను
స్థాపించడానికి విజ్ఞాన భారతి వంటి సంస్థలు గొప్ప కృషిని అందిస్తున్నాయన్నారు.
వేల సంవత్సరాల తర్వాత కూడా నేటికి ఔచిత్యాన్ని కలిగి ఉన్న సాంప్రదాయ విజ్ఞాన
వ్యవస్థల రక్షణ, వ్యాప్తి మన కర్తవ్యంమని గవర్నర్ స్పష్టం చేసారు. వందల
సంవత్సరాలుగా, మన దేశం సంపూర్ణ ఆరోగ్య సాధనంగా యోగా, ఆయుర్వేదంలను
విశ్వసిస్తుందన్నారు. ప్రధాని ప్రతిపాదించిన ఆత్మ నిర్భర్ భారత్‌ను
సాధించేందుకు స్వదేశీ స్ఫూర్తిని పెంపొందించడం ద్వారా మన దేశాన్ని అన్ని
రంగాలలో స్వావలంబనగా మార్చాలన్నారు. భారతీయ విజ్ఞాన మండలి అధ్యక్షడు పిఎస్
అవధాని, ఉపాధ్యక్షుడు అచార్య కైలాసరావు, కౌశల్ 2022 రాష్ట్ర కోఆర్డినేటర్
డి.చంద్ర శేఖర్, విజ్ఞాన భారతి జాతీయ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు కెఎస్
శాస్త్రి, స్కూల్ ఆఫ్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్ డైరెక్టర్ అచార్య రమేష్ ,
గవర్నర్ కార్యదర్శి ఆర్ పి సిసోడియా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం భారతీయ విజ్ఞాన మండలి, ఆంధ్ర
ప్రదేశ్ విజ్ఞాన భారతి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ
సంయిక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కౌశల్ – 2022 పోటీలో 2431 పాఠశాలల నుండి
55,012 మంది విద్యార్థులు పాల్గొన్నారు.