వెలగపూడి : గ్రామ రెవెన్యూ సహాయకులకు గతంలో ఇస్తున్న డి ఏ ను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ మరియు ఏపీజేఏసీ అమరావతి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు మాసాలకు ఒకసారి డి ఎ మంజూరు కాగానే, గ్రామ రెవిన్యూ సహాయకులకు కూడా ప్రభుత్వం ప్రతి నెల కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే డి ఏ రూపంలో 2017వరకు మంజూరు చేస్తూ ఉండేవారు. దశాబ్దాల క్రితం అయిదు రూపాయలతో మొదలు అయిన డి ఎ, 2017నాటికి మూడు వందలకు చేరింది.
ఈ దశలో గత ప్రభుత్వ హయాంలో 2018లో గ్రామ రెవెన్యూ సహాయకులు జీతం 6500 నుండి 10,500 లకు పెంచుతూ, అప్పటివరకు డి ఎ రూపంలో ఇస్తున్న 300 ల విషయం సదరు జీతాలు పెంచిన జీఓలో పొందుపరచలేదు. కానీ జీతాలు పెంచక ముందు నుండే అంటే 2017లోనే అడహక్ డి ఎ 300 పెంచుతూ ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నందున, 2018 లో జీతాలు కొరకు ఇచ్చిన జీవో లో ఆ విషయాన్ని పొందు పరచక పోయినప్పటికీ రాష్ట్రంలో వీఆర్ఏ లకు 2018- 2020వ సంవత్సరం వరకు డీఏ 300 లతో కలిపి వారందరికీ జీతాలు చెల్లించే వారు. ట్రెజరీ శాఖ ద్వారా పై విషయాన్ని తెలుసుకున్న ప్రస్తుత ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా అనగా 2018 నుండి 2020 వరకు చెల్లించిన డి ఎ ను షుమారు 14 కోట్లు రికవరీ చేయడం జరిగింది.
గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకులు సంఘం పక్షాన అనేక సమావేశాల్లో సిఎస్ కి, మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి, ముఖ్యమంత్రి కార్యాలయం లోని ఉన్నతాధికారుల దృష్టికి అందరికీ అనేక సమయాల్లో వారి దృష్టికి తీసుకుని వెళ్లి రికవరీ ఆపేయాలని, తిరిగి నాటి నుంచి డి ఏ ను పునరుద్ధరణ చేయాలని ఏపీ జేఏసీ అమరావతి పక్షాన గత 2023 లో చేసిన 92 రోజుల ఉద్యమం లో కూడా ఈ అంశాన్ని ప్రధానంగా చర్చించింది. గ్రామ రెవిన్యూ సహాయకులు రెవిన్యూ శాఖలో అట్టడుగు స్థాయిలో శక్తి వంచన లేకుండా పనిచేస్తూ చాలీ చాలని జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారని, రోజు రోజుకు పెరుగుతున్న ధరలకు అనుగుణముగా వారు నిలదొక్కుకోవడానికి వారికి ఇస్తున్న డి ఏ ను నిలుపుదల చేయడం దారుణమని అలాగే గతములో మంజూరు చేసిన డి ఎ ని కూడా రికవరీ చేయడము అనేది ఇంకా దారుణమని దీని వల్ల ఈ చిరుద్యోగులు వారి కుటుంబాలు రోడ్డున పడతాయని ఇటీవల గౌరవ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో 13/07/2023 తేదీన నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశములో సిఎస్ మరియు ఇతర ఉన్నతాధకారుల దృష్టికి గట్టిగా తీసుకెళ్ళడము వలన రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించారు. త్వరలోనే వి ఆర్ ఎ ల డి ఏ కు సంబంధించి సానుకూల ఉత్తర్వులు వస్తాయని ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో గ్రామ రెవిన్యూ సహాయకులు (వి.ఆర్.ఏ) గా పనిచేస్తున్న 19359 మంది వి. ఆర్. ఏ లు ప్రభుత్వం పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ, 2018 వ సంవత్సరంలో గత ప్రభత్వంలో ఆపివేసిన వి.ఆర్.ఏ ల కరువు భత్యంను పునరుద్దరిస్తూ తేదీ 2.2.2024 నుండి అమలు లోకి తీసుకువస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు జారీ చేసినందుకు ఏ.పి.జె.ఏ.సి.అమరావతి మరియు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ పక్షాన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు , విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి యస్. జవహర్ రెడ్డి, సిసియల్ఏ & స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్, అజయ్ జైన్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ కి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, గ్రామ రెవెన్యూ సహాయకులు రాష్ట్ర అధ్యక్షుడు గరికపాటి బ్రహ్మయ్య, ఏపీ జేఏసీ అమరావతి సెక్రెటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబ్రోలు కృష్ణ మూర్తి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.