విజయవాడ : విజయవాడలో డిప్యూటీ సీఎం,పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ
మంత్రి బుడి ముత్యాల నాయుడుని వారి క్యాంపు కార్యాలయంలో గ్రామ వార్డు సచివాలయ
ఉద్యోగుల ప్రధాన సమస్యలపై ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం ప్రభుత్వ
ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ వినతిపత్రం అందజేశారు.
వేలాదిమంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు 41 నెలల నుంచి బదిలీలు లేక తీవ్ర
ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాన్ని తక్షణమే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని
వెళ్లి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ బదిలీలు జరిగేలా చూడాలని, రెండవ
నోటిఫికేషన్ ద్వారా నియమితులైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు త్వరితగతిన
ప్రోబేషన్ డిక్లరేషన్ చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. “ఒక గ్రామ
పంచాయతీకి ఒక కార్యదర్శి” వ్యవస్థను అమలుచేసి, గ్రేడ్- 5 పంచాయతీ
కార్యదర్శులకు డి డి ఓ అధికారాలు, పూర్తి స్థాయిలో గ్రామపంచాయతీ పాలనా
బాధ్యతలు అప్పగించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.
మొదటి నోటిఫికేషన్ ద్వారా నియమితులై, అన్ని అర్హతలు కలిగిన సుమారు 100 మందికి
పైగా సచివాలయ ఉద్యోగులకు ఇంకనూ ప్రొబేషన్ డిక్లరేషన్ చేయలేదని, వారందరికీ
ప్రొబేషన్ డిక్లేర్ చేసే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వవలసిందిగా
వినతిపత్రం సమర్పించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో పనిచేస్తున్న గ్రామ సచివాలయ
ఉద్యోగుల పదోన్నతులపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ
సమస్యలన్నీటిపై ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, వీలైనంత త్వరగా సమస్యల
పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ
వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పార్ష మధు,
కృష్ణాజిల్లా కోఆర్డినేటర్ గోపీచంద్, ఎన్టీఆర్ జిల్లా కోఆర్డినేటర్ నవీన్,
నాయకులు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.