మెసొపొటేమియా కాలంనుంచే భవనాల పైకప్పుపై తోటలు
జర్మనీలో 50 ఏళ్ళ క్రితం నుంచే ఆధునిక గ్రీన్ రూఫ్‌లు
మన దేశంలోనూ సానుకూల స్పందన
పర్యావరణ స్పృహతో ఆసక్తి చూపుతున్న హైదరాబాదీలు
ప్రపంచవ్యాప్తంగా భవనాల పైకప్పులు ఆకుపచ్చగా మారుతున్నాయి. నగరాలను మరింత నివాసయోగ్యంగా మార్చుకునే ప్రయత్నాల్లో భాగంగా ఇళ్లు, వాణిజ్య భవనాల పైకప్పులు ‘గ్రీన్ రూఫ్’లుగా మారుతున్నాయి. అవి పూల మొక్కలు కావచ్చు లేదా కూరగాయ మొక్కలు కావచ్చు.. గ్రీన్ రూఫ్ల వల్ల ఒకటికి పది ప్రయోజనాలున్నాయని ప్రపంచం కోడై కూస్తోంది. ‘ప్రపంచ నగరాల దినోత్సవం’ సందర్భంగా గ్రీన్ రూఫ్‌లు అందించే పర్యావరణ, ఆరోగ్య, ఆహార ప్రయోజనాలను గమనిస్తే ఆశ్చర్యం కలగక మానదు! సగం మంది ప్రజలు పట్టణాలు, నగరాల్లోనే నివాసం ఉంటున్నారు. 2030 నాటికి ఈ శాతం మరింత పెరుగుతుంది. భూతాపోన్నతి వల్ల వాతావరణంలో ప్రతికూల మార్పులు అంతకంతకూ పెరుగుతున్నాయి. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా హెచ్చు తగ్గుల పాలవుతూ ప్రజల జీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్నాయి. అతి వేడి, అతి చలి ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తున్నాయి. వాయు కాలుష్యానికి నగరాలే కేంద్ర బిందువులుగా మారాయి. ఇటీవలికాలంలో నగరాలు ఎదుర్కొంటున్న మరో ఉపద్రవం ఆకస్మిక కుండపోత వర్షాలు–వరదలు. ఇవి ప్రజల జీవన నాణ్యతను దెబ్బతీయటమే కాకుండా వారి శారీరక, మానసిక ఆరోగ్యాలనూ ప్రభావితం చేస్తున్నాయి. నగరాలు ఎదుర్కొంటున్న ఈ పర్యావరణ, సామాజిక, ఆరోగ్య సమస్యలకు గ్రీన్ రూఫ్‌లు పరిష్కారంగా కనిపిస్తున్నాయి. గ్రీన్ రూఫ్ గార్డెన్లు పచ్చదనాన్ని నగరాల్లోకి తిరిగి తీసుకొస్తున్నాయి.
గ్రీన్ రూఫ్ గార్డెన్ అంటే?
గ్రీన్ రూఫ్‌టాప్ గార్డెన్ (మిద్దె తోట) అంటే.. ఇంటి పైకప్పు మీద ఉండే ఆకుపచ్చని తోట. మెసొపొటేమియా జిగ్గురాట్ల కాలం నుంచే భవనాల పైకప్పులపై తోటలు పెంచుతున్నారు. గ్రీన్ రూఫ్‌లు ఆధునిక రూపాన్ని సంతరించుకోవటం జర్మనీలో 50 ఏళ్ళ క్రితమే ప్రారంభమైంది. అప్పట్లో ఇది విడ్డూరంగా చెప్పుకునేవారు. అదే జర్మనీ ఇప్పుడు ‘ఐరోపా గ్రీన్ రూఫ్ క్యాపిటల్’గా పేరుగాంచింది. గ్రీన్ గార్డెన్… కంటికి ఆహ్లాదాన్నిస్తూనే, వేసవిలో చల్లదనాన్నీ/శీతాకాలంలో వెచ్చదనాన్నీ పంచుతూ విద్యుత్తును ఆదా చేస్తోంది. మిద్దెతోట… పూలు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటి ఆహారాన్ని, మూలికలను అందిస్తున్నాయి. ఇక విద్యుత్తును అందించే సౌర ఫలకాలూ గ్రీన్ రూఫ్ గార్డెన్‌కు కొత్త సొబగులను అద్దుతున్నాయి.
రూఫ్ గార్డెన్ ఖర్చెంత?
గ్రీన్ రూఫ్ గార్డెన్లను ఏర్పాటు చేయటం కొంచెం ఖర్చుతో కూడిన పనే. భవనం స్లాబ్ దెబ్బ తినకుండా ఉండేందుకు, నీటిని ఒడిసి పట్టేందుకు, మొక్కలు/చెట్ల వేర్లు స్లాబ్‌లోకి చొరబడకుండా నివారించడానికి, ఇన్సులేషన్ కోసం అనేక దొంతర్లు వేసిన తర్వాత.. ఆపైన మొక్కలు/చెట్లు పెంచేందుకు రూఫ్ పైభాగంలో మట్టి మిశ్రమాన్ని 6 నుంచి 12 అంగుళాల మందంతో వేస్తారు. ఆ తర్వాత పచ్చని మొక్కలు లేదా పంటలు వేస్తారు. ఇదంతా చెయ్యటానికి చదరపు అడుగుకు 15 నుంచి 20 డాలర్లు ఖర్చు అవుతుందని ఒక అమెరికా సంస్థ అంచనా. గ్రీన్ రూఫ్‌టాప్ గార్డెన్లకు జర్మనీ, అమెరికా, జపాన్, కెనడా, సింగపూర్ అతిపెద్ద మార్కెట్లుగా మారాయి. ఈ మార్కెట్ 2025 నాటికి 880 కోట్ల డాలర్లకు పెరగనుందని పరిశోధనా సంస్థ టెక్నావియో అంచనా. అయితే.. సేంద్రియ ఇంటి పంటలు సాగు చేసుకోవటం వరకే అయితే పెద్దగా ఖర్చు అవసరం లేదు. కంటైనర్లు, కుండీలు, ఎత్తు మడుల్లో వేసుకోవచ్చు. రూఫ్ మొత్తాన్నీ కప్పి ఉంచేలా అనేక దొంతర్లుగా గార్డెన్‌ను నిర్మించాలనుకుంటేనే ఖర్చు ఎక్కువ అవుతుంది.
ఇంటిపంటలతో ప్రాణవాయువు :10 అడుగుల వెడల్పు, 10 అడుగులు పొడవు వుండే స్థలంలో పెరిగే మొక్కలు 13 అడుగులఎత్తయిన చెట్టుతో సమానంగా బొగ్గుపులుసు వాయువును పీల్చుకొని ప్రాణవాయువును విడుదల చేస్తాయని అంచనా. గ్రీన్ రూఫ్ మన దేశానికీ కొత్త కాన్సెప్ట్ అయినప్పటికీ, దేశవ్యాప్తంగా సానుకూల స్పందన కనిపిస్తోంది. పెద్ద నగరాల్లో గ్రీన్ రూఫ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సుస్థిర జీవనం, పర్యావరణ స్పృహ కలిగిన నగరవాసులు సేంద్రియ ఆహారం ప్రాముఖ్యతను, సేంద్రియ ఇంటిపంటల సాగు ఆవశ్యకతను గ్రహిస్తున్నారు.
కొసమెరుపు :హైదరాబాద్ నగరంలో భవనాల పైకప్పుల విస్తీర్ణం కనీసం 50 వేల ఎకరాలకు పైగా ఉండొచ్చని ఒక అంచనా. దాదాపుగా ఈ రూఫ్లన్నీ ఖాళీగానే వున్నాయి. వీటిని గ్రీన్ రూఫ్ గార్డెన్లు గానో లేదా సేంద్రియ ఇంటిపంటల తోటలుగానో (సౌర ఫలకాలను కూడా వీటిలోనే పెట్టుకోవచ్చు) మార్చితే..? ఇదే మాదిరిగా ఇతర నగరాలూ, పట్టణాలను మార్చితే? పర్యావరణ పరంగా, ఆహార భద్రతా పరంగా, ప్రజారోగ్యపరంగా మహా అద్భుతమే ఆవిష్కృతమవుతుంది!
నగరాలను చల్లబరిచే మార్గం
పట్టణ ప్రాంతాల్లో భవనాల పైకప్పుల విస్తీర్ణం సాధారణంగా పట్టణ భూభాగంలో 5–35 శాతం వరకు ఉంటుంది. అమెరికాలో 90 శాతానికి పైగా భవనాల పైకప్పులు ఖాళీగా ఉన్నాయని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అంచనా. చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల కంటే నగర వాతావరణంలో 5.6 డిగ్రీల సెంటీగ్రేడ్ అధిక వేడి ఉంటుంది. దీన్నే ‘అర్బన్ హీట్ ఐలాండ్‘ అని పిలుస్తారు. గాలి కూడా సాధారణం కంటే వేడిగా ఉంటుంది. పైకప్పులు వేడిగా ఉన్నప్పుడు, భవనాల లోపలి గదులను చల్లబరచడం కష్టం. ఇది నగర విద్యుత్ గ్రిడ్‌పై అధిక భారాన్ని మోపుతుంది. అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం వల్ల నగరంలో వాయు కాలుష్యం కూడా తీవ్రమవుతుంది. ఉదాహరణకు, నగరాల్లో అధిక ఉష్ణోగ్రతల వల్ల గాలిలో ఓజోన్ వాయువు సాంద్రత పెరుగుతుంది. ఇది శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది. అయితే.. భవనాల పైకప్పులపై కనీసం 30% విస్తీర్ణంలో మొక్కలు, చెట్లు పెంచినప్పుడు దాదాపు 1 డిగ్రీ సెల్సియస్ వరకు వాతావరణం చల్లబడిందని బాల్టిమోర్–వాషింగ్టన్ మెట్రోపాలిటన్‌లో.